రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు సక్సెస్ ఫుల్ & ఇన్నోవేటివ్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్న వర్మ, ప్రస్తుతం విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఈ మధ్య కాలంలో వర్మపై తరచూ వస్తున్న విమర్శ… ‘సినిమాలో క్వాలిటీ లేదని, లోబడ్జెట్ లో సినిమాలను చుట్టేస్తున్నాడని’. ఇటివల కాలంలో వర్మ సినిమా షూటింగ్ డేస్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్నారు. నెలకొక కొత్త సినిమా సంగతులు చెప్తున్నారు. ‘రౌడి’ విడుదలైన వెంటనే ‘ఐస్ క్రీం’ అన్నారు. తర్వాత ‘పట్టపగలు’ విడుదలకు సిద్దంగా ఉంది.
తక్కువ రోజులలో సినిమా కంప్లీట్ చేయడం వలన సినిమా క్వాలిటీ తగ్గుతుందనే విమర్శపై మీరేమంటారు అని వర్మను అడిగితే.. ‘నేను చాలా ఎక్కువ రోజులు టైం స్పెండ్ చేసి, చాలా రోజుల పాటు శ్రమించి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. ‘ఆగ్’, ‘డిపార్టుమెంట్’, ‘దౌడ్'(హిందీ సినిమాలు) నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్లాప్స్. చాలా తక్కువ డబ్బుతో తీసిన సత్య, సర్కార్ సినిమాలు హిట్ అయ్యాయి. అందువల్ల మనీ ఖర్చుపెట్టడానికి, సినిమా విజయానికి సంబంధం లేదు.’ అని జవాబు ఇచ్చారు.
తను తెరకెక్కించే ప్రతి సినిమాలో ఏదోక కొత్త టెక్నాలజీని పరిచయం చేయడానికి ఉత్సాహం చూపించే వర్మ.. ఈ శనివారం విడుదలవుతున్న ‘ఐస్ క్రీం’తో ఫ్లోకాం టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. సినిమా విజయంలో కథ ప్రముఖ పాత్ర పోషిస్తే టెక్నాలజీ సహాయక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ‘ఐస్ క్రీం’ కథగా రాస్తే అరపేజి కూడా ఉండదంట. కానీ సినిమాలో ఫ్లోకాం టెక్నాలజీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని అంటున్నారు. కథ లేకుండా సినిమా హిట్ కాదని అంటున్న వర్మ, ‘ఐస్ క్రీం’లో కథ కన్నా టెక్నాలజీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అంటున్నారు. ఏంటో మాటలతో మాయ చేస్తున్నారు.


