దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది అక్టోబర్ నాటికే పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ గ్లోబల్ రిలీజ్ ప్లాన్‌కు హాలీవుడ్ భారీ చిత్రాల రూపంలో ఒక పెద్ద సవాలు ఎదురుకానుంది.
రాజమౌళి ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ మరియు ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్‌ను టార్గెట్ చేస్తూ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. కానీ, ‘వారణాసి’ విడుదలయ్యే సమయానికి హాలీవుడ్ సెన్సేషన్ ‘గాడ్జిల్లా x కాంగ్: సూపర్నోవా’ థియేటర్లలో రన్ అవుతుంటుంది. దీనికి తోడు, అదే పీరియడ్‌లో ‘పానిక్ కేర్ఫుల్లీ’ అనే మరో క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా థియేటర్లలోకి రానుంది. ఈ హాలీవుడ్ పెద్ద సినిమాలు రేసులో ఉండటంతో గ్లోబల్ మార్కెట్లో ఐమ్యాక్స్ స్క్రీన్స్‌ను దక్కించుకోవడం ‘వారణాసి’కి అంత సులువు కాదు.
సాధారణంగా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లు ఇలాంటి ప్రీమియం స్క్రీన్స్‌ను చాలా నెలల ముందే బుక్ చేసుకుంటాయి. ఇలాంటి తరుణంలో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మన ఇండియన్ చిత్రానికి థియేటర్ల కేటాయింపు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇంటర్నేషనల్ క్లాష్‌ను రాజమౌళి ఎలా అధిగమిస్తాడనేది చూడాలి.
