‘బ్లూ స్కై’ చేతికి రెండు క్రేజీ ప్రాజెక్టుల యూఎస్ రైట్స్!

‘బ్లూ స్కై’ చేతికి రెండు క్రేజీ ప్రాజెక్టుల యూఎస్ రైట్స్!

Published on Sep 26, 2015 5:31 PM IST

blue-sky
తెలుగు సినిమాకు అమెరికన్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి క్రేజ్ ఉందన్న విషయాన్ని ఇప్పటికే చాలా సినిమాలు ఋజువుచేయగా, తాజా బాక్సాఫీస్ ప్రభంజనం ‘బాహుబలి’, యూఎస్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఒక ప్రాంతీయ సినిమా ఊహకు కూడా అందని రేంజ్‌లో ‘బాహుబలి’ అమెరికాలో ప్రభంజనం సృష్టించింది. ఇక అమెరికాలో ‘బాహుబలి’ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసిన బ్లూ స్కై సినిమాస్, ప్రస్తుతం మరో రెండు పెద్ద సినిమాల యూఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోవడం విశేషంగా కనిపిస్తోంది.

యూఎస్‌లో ‘బాహుబలి’ విజయానికి కీలక పాత్ర పోషించిన బ్లూ స్కై సినిమాస్, ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం తెలుగులో క్రేజీగా మారిపోయిన రెండు సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాల్లో త్రివిక్రమ్-నితిన్‌ల క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న ‘అ..ఆ’ ఒకటి కాగా, మరొకటి నాగ చైతన్య హీరోగా మళయాలంలో రికార్డులను తిరగరాసిన ప్రేమమ్ సినిమాకు రీమేక్‌గా రూపొందుతోన్న మజ్నూ.

త్రివిక్రమ్ సినిమాలకు సాధారణంగానే యూఎస్ బాక్సాఫీస్ వద్ద విపరీతమైన క్రేజ్ ఉంటుంది. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ యూఎస్‌లో ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘అ..ఆ’ సినిమా యూఎస్ హక్కులను బ్లూ స్కై సినిమాస్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇక మళయాల సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ప్రేమమ్ సినిమాను తెలుగులో నాగ చైతన్య రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై తెలుగులోనూ విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. మళయాల సినిమాకు జరిగిన మ్యాజిక్ తెలుగు రీమేక్ అయిన మజ్నూకి కూడా రిపీట్ అవుతుందన్న అభిప్రాయంలో ఈ సినిమాకూ ఇప్పట్నుంచే మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బ్లూ స్కై సినిమాస్ మజ్నూ సినిమా హక్కులను కూడా ఫ్యాన్సీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో తెలుగులో ప్రస్తుతం క్రేజీగా మారిన రెండు సినిమాల యూఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకొని బ్లూ స్కై సినిమాస్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను ప్రస్తుతం రాబోయే సినిమాలతోనూ నిలబెట్టుకుంటామని సంస్థ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు