మెగాస్టార్ చిరంజీవి.. సగటు తెలుగు సినీ అభిమానికి పరిచయమక్కర్లేని పేరు. తనదైన మ్యానరిజమ్, యాక్టింగ్‌తో మూడు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకొని నిలబడ్డ స్టార్. గత కొన్నేళ్ళుగా పూర్తిగా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ అయి సినిమాల్ని పక్కన పెట్టిన చిరు, ప్రస్తుతం మళ్ళీ 150వ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇదలా ఉంచితే.. నేడు (ఆగష్టు 22) చిరంజీవి తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ 60వ జన్మదినోత్సవ వేడుకలను గ్రాండ్‌గా జరిపేందుకు మెగా ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లు చేసింది.
హైద్రాబాద్‌లో ఈ సాయంత్రం చిరంజీవి ఫ్యామిలీ ఓ పెద్ద ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్క్ హాయత్ హోటల్లో జరగనున్న ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ వేడుకలో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌లు హైద్రాబాద్‌కి విచ్చేశారు. కోలీవుడ్ స్టార్స్ సూర్య, కార్తీలు కూడా ఈ వేడుకలో పాల్గొనేందుకు హైద్రాబాద్ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుక అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా మెగా ఫ్యామిలీ భారీగా ఏర్పాట్లు చేసింది.


