ఇంటర్వ్యూ : ప్రభాకర్ – నేను రాసుకున్న కథలన్నీ సెంటిమెంట్ కథలే !

ఇంటర్వ్యూ : ప్రభాకర్ – నేను రాసుకున్న కథలన్నీ సెంటిమెంట్ కథలే !

Published on Aug 1, 2018 5:10 PM IST

ప్రభాకర్ దర్శకత్వంలో సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రాండ్ బాబు’. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శైలేంద్ర బాబు నిర్మించారు. కాగా ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఈ చిత్రం ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర దర్శకుడు ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

యాక్టర్ గా యాంకర్ గా టెలివిజన్ లో బిజీగా ఉన్నారు కదా ? మరి ఎందుకు దర్శకుడు మారాలనుకున్నారు ?

నేను టెలివిజన్ లో ఎప్పుడు బిజీగానే ఉన్నాను. కానీ నాకు ఎందుకో డైరెక్టర్ కావాలని ఆలోచన రావటం, దాంతో ఓ కథ రాసుకొని గీతా ఆర్ట్స్ లో చెప్పటం జరిగింది. అక్కడ కథ అందరికీ బాగా నచ్చి అరవింద్ గారు మనం చేస్తున్నాం అని నాకు అడ్వాన్స్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల ఆ కథకు బదులు ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రాన్ని రీమేక్ చెయ్యాల్సి వచ్చింది. అది బాగా నిరుత్సాహ పరిచింది. ఆ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు దూరమవ్వడంతో సినిమా ఫలితం తారుమారైంది.

ఆ సినిమా నిరుత్సాహ పరిచింది అని మీరే అంటున్నారు ? మరి బ్రాండ్ బాబుకు అవకాశం ఎలా వచ్చింది ?

‘ నేను డైరెక్షన్ బాగా చేస్తున్నానని టాక్ రావడంతో ఓ రోజు మారుతిగారు పిలిచి ఈ సినిమా గురించి చెప్పారు. ఒక విధంగా నెక్స్ట్ నువ్వే’ షూటింగ్ చివర్లో ఉండగానే నాకు ఈ బ్రాండ్ బాబు చిత్రానికి దర్శకుడుగా అవకాశం వచ్చింది. మారుతిగారి సినిమాల బ్రాండ్ ఎలా ఉంటుందో ఈ సినిమా బ్రాండ్ కూడా అలానే ఉంటుంది. అంటే మారుతిగారి సినిమాల శైలిలోనే ఈ బ్రాండ్ బాబు చిత్రం తియ్యటం జరిగింది.

బ్రాండ్ బాబు సినిమా గురించి చెప్పమంటే ఏం చెబుతారు ?

సినిమా ఓపెనింగ్ సిన్ లోనే ఓ అద్భుతమైన సీన్ ఉంటుంది అండి. ఆ సీన్ తోనే చాల కనెక్ట్ అయ్యాను. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమాలో హీరో ఫ్యామిలీకి బ్రాండ్ పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితో ఆడియన్స్ ను నవ్వించటానికి మేం కొంచెం వెటకారంగా తీశాము. ఇంటర్వెల్ సీన్ లో ట్విస్ట్ కూడా చాలా కామెడీగా చాలా ఆకట్టుకున్నే విధంగా ఉంటుంది.

ఇంటర్వెల్ సన్నివేశాలను మారుతిగారు డైరెక్ట్ చేశారట ?

ఇంటర్వెల్ సీన్స్ షూట్ చెయ్యాల్సిన రోజే నా ఓన్ బ్రదర్ చనిపోయాడు. నాకేమో షూట్ క్యాన్సల్ చెయ్యటం ఇష్టం లేక మారుతిగారికి ఫోన్ చేసి, నేనే బతిమిలాడి మరి ఆయన్నీ డైరెక్ట్ చెయ్యమన్నాను. ఏదేమైనా మారుతిగారి హ్యాండ్ చాలా మంచింది అండి. అది నాకు కలిసి ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక బయట రూమర్స్ వస్తున్నట్లు లొకేషన్ లో మారుతుగారు ఎప్పుడు ఇన్ వాల్వ్ అవ్వలేదు. ఒకవేళ (నవ్వుతూ) ఇన్ వాల్వ్ అయినా బాగుండేది, నేను కొంచెం రిలాక్స్ అయ్యేవాడ్ని.

ఈ సినిమాలో హీరో సుమంత్ శైలేంద్ర గురించి చెప్పండి ?

హీరో ‘సుమంత్ శైలేంద్ర’ ఫాదర్ శైలేంద్ర బాబుగారే ఈ సినిమాకు ప్రొడ్యూసర్. అందరి కంటే ఫస్ట్ సెట్ కు వచ్చేది ఆయనే. ఆయన మాకు చాలా బాగా సపోర్ట్ చేసారు. ఇక మా హీరో ‘సుమంత్ శైలేంద్ర గురించి చెప్పాలంటే తను చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమా చేసాడు. డైలాగ్స్ కూడా చాలా ప్రాక్టీస్ చేసి మరి సెట్ కు వచ్చేవాడు. ఒక విధంగా చెప్పాలంటే బ్రాండ్ బాబుగా తను పర్ఫెక్ట్ గా సరిపోయాడు. తన లుక్స్, ఆటిట్యూడ్ చాలా బాగుంటాయి. బ్రాండ్ బాబు అంటే ఇలాగే ఉండాలి అనే అంతగా ఈ పాత్రలో సుమంత్ శైలేంద్ర యాప్ట్ అయ్యాడు.

మీరు చేసిన సీరియల్స్ కు ‘ఏ టు జెడ్’ మీరే కదా ? సినిమాకు వచ్చే సరికి మీకు ఆ ఛాన్స్ రాలేదు ?

రాలేదు అనేదాని కంటే నేనే తీసుకోలేదు అనడం కరెక్ట్ ఏమో. ఎందుకంటే బ్రాండ్ బాబు విషయానికి వస్తే.. మారుతిగారు ఆల్ రెడీ స్క్రిప్ట్ మొత్తం పర్ఫెక్ట్ గా రెడీ చేసి ఉంచారు. నేను ఓన్లీ డైరెక్షన్ చేస్తే చాలు. నేను అదే చేశాను.

మీరు కథ రాసాను అన్నారు కదా. ఆ కథతో సినిమా చేస్తారా ?

నేను రాసుకున్న కథలన్నీ సెంటిమెంట్ కథలే నండి. ఒక ఫాదర్ కొడుకు రిలేషన్, ఒక అమ్మ కొడుకుల రిలేషన్, అక్క తమ్ముడు రిలేషన్ ఇలా మనం మర్చిపోయిన అనుబంధాలని ప్రజలకు గుర్తు చేయాలని నాకు చాలా బలంగా ఉంది. మరి అలాంటి సినిమాలు చెయ్యాలంటే ముందు నేను ప్రొడ్యూసర్ లను ఒప్పించాలి. ఒప్పించటం మాటలు కాదు కదా.

మీ తర్వాత సినిమా మీ కథతోనే చేస్తారా ?

నా దగ్గర ప్రస్తుతం మూడు నాలుగు స్క్రిప్ట్స్ ఉన్నాయండి. అలాగే మారుతిగారికి ఓ సినిమా కమిట్ అయ్యాను, జ్ఞాన్ వెల్ గారితో కూడా ఓ సినిమా కూడా కమిట్ అయ్యాను. ఏమైనా బ్రాండ్ బాబు రిలీజ్ అయ్యాకే ఏ సినిమా చేస్తాను ఎవరితో చేస్తాను అనేది క్లారిటీ వస్తోంది.

మీరు సీరియల్ డైరెక్ట్ చేశారు. అలాగే సినిమా కూడా డైరెక్ట్ చేశారు ? రెండిట్లో ఏది ఎక్కువ కష్టం ?

నాకు తెలిసినంతవరకు సీరియల్ డైరెక్టర్ ప్రతి ఒక్కరు సినిమా డైరెక్ట్ చెయ్యగలడు, కానీ ప్రతి సినిమా డైరెక్టర్ సీరియల్ ను డైరెక్ట్ చెయ్యలేడు. ఎందుకంటే సినిమా శైలిలో సీరియల్ డైరెక్ట్ చేస్తే రోజుకు రెండు మూడు సీన్స్ మాత్రమే డైరెక్ట్ చేయ్యగలడు. కానీ సీరియల్ లో రోజుకు ఎపిసోడ్లు డైరెక్ట్ చెయ్యాల్సి వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సీరియల్ కోసం ఎక్కువ పని చెయ్యాలి, సినిమా కోసం ఎక్కువ ఆలోచించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు