
సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మురుగదాస్ శిష్యుడు వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమా ‘టైగర్’. మంచి అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడమే కాక బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఓపెనింగ్స్‌ను సాధించి పెట్టింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిన సందీప్ కిషన్, ‘టైగర్’ ద్వారా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ను దాటేస్తాడనే టాక్ మొదట్నుంచీ వినిపిస్తూ వస్తోంది.
‘టైగర్’ సినిమా హిట్ కావడమనేది తనకు ఎంతో అవసరమని సందీప్ కిషన్ భావిస్తున్న నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో నిన్న నిర్వహించిన సక్సెస్ టూర్లో ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్‌కు థ్రిల్ అయిన సందీప్, ఈ ఉదయం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోన్‌తో మరింత థ్రిల్ అయ్యారు.
“వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత బన్నీ అన్న దగ్గర నుండి టైగర్ సినిమాకు ఫోన్ వచ్చింది. కంగ్రాట్స్, సినిమా చాలా నచ్చింది అని చెప్పాడు బన్నీ. నాకైతే ఈ కాల్ మళ్ళీ కొత్త ఎనర్జీనిచ్చింది” అంటూ సందీప్ కిషన్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘టైగర్’ సినిమా విషయానికి వస్తే.. సందీప్ కిషన్ ఎనర్జిటిక్ యాక్టింగ్, రాహుల్ రవీంద్రన్ స్ట్రాంగ్ సపోర్ట్, కట్టిపడేసే వీఐ ఆనంద్ స్క్రీన్‌ప్లే, థమన్ మ్యూజిక్, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ మేజర్ హైలైట్స్‌గా నిలిచాయి.

