మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ వచ్చే నెల జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా భోపాల్‌లో ఒక గ్రాండ్ మ్యూజికల్ కన్సర్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రమోషన్స్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అలాగే సినిమా విడుదలకు రెండు రోజుల ముందు, అంటే జూన్ 2న హైదరాబాద్‌లో ఒక భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథి ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ, ఈ ఈవెంట్‌కు గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తే బాగుంటుందనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ‘అన్‌స్టాపబుల్’ షోలో బాలయ్య-చరణ్ ల మధ్య ఉన్న మంచి బాండింగ్ అందరూ చూశారు. వీరిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే మెగా-నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి.
ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. ‘పెద్ది’ సినిమాను నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ సంస్థే, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న నెక్స్ట్ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. తమ బ్యానర్‌లో రాబోయే నెక్స్ట్ హీరోను ప్రస్తుత సినిమా ఈవెంట్‌కు పిలవడం నిర్మాతలకు ఒక ఆనవాయితీ. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ కూడా ఈ వేడుకకు వస్తే ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌కు నెక్స్ట్ లెవెల్ బూస్ట్ లభించడం ఖాయం.


