తెలుగు సాహిత్య అభిమానులకు రచయిత ‘అంపశయ్య’ నవీన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఆయన తన మొదటి నవల అంపశయ్యనే ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. 1969లో వచ్చిన ఈ నవలను సినిమాగా తీయాలని ఏళ్ళుగా ప్రయత్నాలు జరుగుతుండగా, చివరికది ఇప్పటికి సాధ్యమైంది. దర్శకుడు ప్రభాకర్ జైని అంపశయ్య నవలను ‘క్యాంపస్ అంపశయ్య’ పేరుతో సినిమాగా మలిచారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించిన ఈ సినిమాను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు చూపించగా, వారివద్ద నుండి ఊహించని స్థాయి స్పందన వచ్చిందని, నవలా రచయిత నవీన్ కూడా తన నవలకు న్యాయం జరిగిందని సినిమా చూశాక అనడం ఆనందాన్నిచ్చిందని దర్శకుడు ప్రభాకర్ తెలిపారు. జూలై 29న వస్తోన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యంలో ఓ విద్యార్థి ఆలోచనల చుట్టూ ఈ కథ నడుస్తుందని దర్శకుడు తెలియజేశారు.
