చిత్ర పరిశ్రమకు చిన్న సినిమాలే పెద్ద దిక్కు – చదలవాడ శ్రీనివాసరావు

Chadalavada-Srinivasa-Rao

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (FCA) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పాల్గొని, చిత్ర పరిశ్రమ మనుగడకు చిన్న సినిమాలే ప్రాణప్రదమని ఉద్ఘాటించారు. చిరంజీవి, ఎన్టీఆర్, రాజమౌళి వంటి ఎందరో ప్రముఖులు చిన్న చిత్రాల ద్వారానే ఎదిగారని ఆయన గుర్తుచేశారు.

చిన్న చిత్రాలను బతికించుకోవడానికి ప్రభుత్వ మద్దతు కంటే ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సహకారం ఎంతో అవసరమని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. డిజిటల్ ప్రొవైడర్ల (క్యూబ్, యూఎఫ్ఓ) అధిక ఛార్జీలు, థియేటర్లలో తినుబండారాల రేట్లు సామాన్య ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో కొందరు నిర్మాతలు ఏర్పాటు చేసుకున్న ‘గిల్డ్’ వ్యవస్థను ఆయన తీవ్రంగా విమర్శించారు. అది పరిశ్రమకు హానికరమని, ప్రభుత్వం వారిని ప్రోత్సహించకూడదని కోరారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే రూ. 3 నుంచి 5 కోట్లలో నాణ్యమైన సినిమా తీయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదే వేదికపై ‘గద్దర్ అవార్డు’ గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ ప్రభును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభు.. తన సతీమణి కీర్తిశేషులు మాధవి పేరిట ఉన్న ట్రస్ట్ ద్వారా ఎఫ్‌సీఏకు రూ. 50 వేల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌సీఏ అధ్యక్షుడు బత్తుల జేవీ ప్రసాదరావు, కార్యదర్శి సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version