హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా ముగిసింది. ఈ వేదికపై పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయం, సినిమా.. ఈ రెండింటిపైనా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన, భావోద్వేగమైన మాటలు మాట్లాడారు. ముఖ్యంగా అభిమానులను ఉద్దేశించి ఆయన చెప్పిన ఓ డైలాగ్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
సభలో అభిమానులు డైలాగ్ చెప్పాలని కోరగా.. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్‌లో స్పందించారు. సినిమాల్లో అయితే ఇచ్చిపడేసే డైలాగులు చెప్పొచ్చని, కానీ బయట అలా చెప్పలేనని నవ్వేశారు. అయినా అభిమానుల కోరిక మేరకు “నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం” అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సభికుల్లో ఫుల్ జోష్ నింపింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు అన్నం పెట్టింది, ఈ రోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చింది సినిమానే అని కాస్త ఎమోషనల్ అయ్యారు. అందుకే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటానని మనసులోని మాటను బయటపెట్టారు. తాను ఏనాడూ కలెక్షన్స్ గురించి పట్టించుకోలేదని, కేవలం తన నిర్మాతలు, దర్శకులు బాగుండాలనేదే తన తపన అని స్పష్టం చేశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి పవన్ చెప్పిన మాటలు మెగా అభిమానులకు మరింత ఆనందాన్నిచ్చాయి. “నా వరకు ఒకే ఒక్క రియల్ హీరో చిరంజీవి గారు. ఆయన్ని ఫంక్షన్‌కు పిలుద్దామని హరీష్ శంకర్ అన్నారు. కానీ ఆయన వస్తే నేను తమ్ముడిలా సైలెంట్ అయిపోతాను” అని పవన్ సరదాగా వ్యాఖ్యానించారు. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి చిరంజీవి, రామ్ చరణ్ ట్వీట్ చేయడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు సినిమాలను తాను తెలుగు, తమిళం, హిందీ అని విడదీసి చూడనని, అదంతా ఒక భారతీయ సినిమా అని పవన్ కళ్యాణ్ తన విశాల దృక్పథాన్ని చాటుకున్నారు.
డిప్యూటీ సీఎంగా రాజకీయ బాధ్యతల్లో ఉంటూనే సినిమాలు చేయడంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కరోనా, రాజకీయాలు తదితర కారణాల వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేట్ అయిందని, అయితే దర్శకుడు హరీష్ శంకర్ ప్లానింగ్ వల్లే ఈ సినిమా పూర్తి కాగలిగిందని కొనియాడారు. కేవలం 40 నుంచి 45 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశామని, ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చేయొచ్చు అనే భరోసా, ధైర్యం తనకు ఈ సినిమానే ఇచ్చిందని పవన్ వెల్లడించారు. గబ్బర్ సింగ్ టైమ్‌లో తనకు గుర్రపుస్వారీ రాకపోయినా హరీష్ చేయించాడని, అభిమానులకు తాను ఎలా కనిపిస్తే బాగుంటుందో అతనికి బాగా తెలుసని దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు ఏం చెబితే అది బ్లైండ్‌గా ఫాలో అయిపోతానని చెప్పి హరీష్ శంకర్‌పై తనకున్న నమ్మకాన్ని పవన్ ప్రదర్శించారు.
