ఇంటర్వ్యూ : లిరిసిస్ట్ చంద్రబోస్ – ‘భోగి’లో ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి..!

ఇంటర్వ్యూ : లిరిసిస్ట్ చంద్రబోస్ – ‘భోగి’లో ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి..!

Published on Nov 22, 2026 12:00 AM IST

చార్మింగ్ స్టార్ శర్వా రస్టిక్ అవతార్‌లో, సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా విశేషాలను, అన్ని పాటలు రాసిన గీత రచయిత చంద్రబోస్ తాజాగా మీడియాతో పంచుకున్నారు.

భోగి సినిమాలో పూర్తిగా తెలంగాణ మాండలికంలో పాటలన్నీ రాయడం ఎలా అనిపించింది?

‘భోగి’ చిత్రంలో నా మూలాలు, చిన్ననాటి జ్ఞాపకాలతో కూడిన అత్యంత సహజమైన తెలంగాణ మాండలికంలో పాటలు రాయడం ఎంతో సంతృప్తినిచ్చింది. ‘రంగస్థలం’ కోసం గోదావరి, ‘పుష్ప’ కోసం చిత్తూరు యాసలను నేర్చుకుని రాసినప్పటికీ, ‘భోగి’ మాత్రం నా సొంత మాండలికం కావడంతో సహజంగా వచ్చాయి. తెలంగాణ పల్లెటూరి బతుకును ప్రతిబింబించే ఈ పాటలకు వస్తున్న ఆదరణ ఆనందంగా ఉంది.

‘ఎగిలివారంగ’ పాట గురించి?

దర్శకుడు సంపత్ నందికి సాహిత్యంపై మంచి పట్టు ఉంది. ‘ఎగిలివారంగ’ పాటలో పొద్దున్న నుంచి రాత్రి వరకు సాగే దినచర్యతో పాటు నాటి గ్రామస్తుల జీవన విధానం, ఆధిపత్యాలను సాహిత్యంతో కళ్లకు కట్టినట్టు చూపించాము. ప్రతి పాటకూ ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ఉండేలా ఒక కథలా రాస్తాను. అందుకే ఈ కథలోని సంఘర్షణ, భావోద్వేగం అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతున్నాయి.

సింగిల్ కార్డు రాయడం ఎలా అనిపించింది?

‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘నేనొక్కడినే’ వంటి చిత్రాలకు సింగిల్ కార్డు రాసిన అనుభవం ఉంది. దీనివల్ల వరుస పాటల మధ్య వైవిధ్యాన్ని చూపే వెసులుబాటుతో పాటు కథకు ఏం చెప్పాలో పూర్తి స్పష్టత ఉంటుంది.

మీ కెరీర్‌లో రాయడానికి ఎక్కువ సమయం తీసుకున్న పాట ఏది?

‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు కంపోజింగ్, మార్పులు, కోవిడ్ కారణంగా 19 నెలల సమయం పట్టింది. నా 31 ఏళ్ల సాహితీ యజ్ఞంలో సహనానికి దక్కిన ఫలితంగానే ఈ ఆస్కార్ వచ్చిందని భావిస్తాను. నేను అంతకంటే గొప్ప గీతాలు ఎన్నో రాసినప్పటికీ, ఆ ఏడాది ప్రేక్షకులను ఉర్రూతలూగించడంలో ఈ ఆడి పాడే పాట నూటికి నూరు మార్కులు కొట్టడం వల్లే అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

భోగి సినిమా చూశారా?

ఈ సినిమాను నేను ఇప్పటికే చూశాను. అద్భుతమైన భావోద్వేగాలతో సాగే కథనంతో ఆకట్టుకుంటుంది. హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నందిలలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం.. కథ, స్క్రీన్‌ప్లే, రచన, సంగీతం, కెమెరా సహా అన్ని విభాగాలకూ మంచి గుర్తింపు తెచ్చి ఘనవిజయం సాధిస్తుంది.

ప్రొడ్యూసర్ రాధామోహన్ గారి గురించి?

నిర్మాత రాధామోహన్ ఎంతో స్నేహశీలి, మంచి వ్యక్తి. నన్ ఆయన ఎంతో ప్రేమగా, గౌరవ మర్యాదలతో చూసుకోవడంతో పాటు నేను రాసిన పాటలన్నింటినీ మనస్ఫూర్తిగా ఆస్వాదించారు.

ప్రస్తుతం మీరు రాస్తున్న సినిమాలు?

‘రౌడీ జనార్ధన’, ‘విశ్వంభర’, ‘బరి’ చిత్రాలతో పాటు రామ్ పోతినేని, శ్రీ విష్ణు సినిమాలు.. అలాగే హిందీలో షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమాకు కూడా నేను పాటలు రాస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు