
గత సంవత్సరం ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ దర్శకులు టాలీవుడ్ కి పరిచయమయ్యి, తమ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలా ఆడియన్స్ ని మెప్పించిన వారిలో చందూ మొండేటి కూడా ఒకరు. చందూ డైరెక్ట్ చేసిన ‘కార్తికేయ’ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో చందూకి రెండవ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ చందూ ముందు చేయాలనుకున్నది నాగ చైతన్యతో కాదట, నాగార్జునతో అట.
చందూ మొండేటి తన రెండవ సినిమా ఎలా మొదలైందో చెబుతూ ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నాకు నాగార్జున గారే స్ఫూర్తి. నా ఫస్ట్ సినిమా సక్సెస్ తో ఆయన్ని కలిసి కథ చెప్పాను. ఆయనకీ నచ్చింది కానీ ఇప్పటికే ఉన్న కమిట్ మెంట్స్ వలన చేయలేనని, తనకంటే ముందుగా నాగ చైతన్యతో సినిమా చేయమని చెప్పడంతో చైతన్యతో సినిమా చేస్తున్నాను. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. నా తదుపరి సినిమా నాగార్జున గారితో ఉంటుందని ఆశిస్తున్నానని’ అన్నాడు.
నాగ చైతన్య నటించిన ‘దోచేయ్’ సినిమా ఏప్రిల్ 24న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య చందు సినిమాని మే లో మొదలు పెట్టనున్నారు.