‘నిన్నే పెళ్ళాడతా’ స్టైల్లో చైతూ కొత్త సినిమా!


అక్కినేని హీరో నాగ చైతన్య స్టార్ స్టేటస్ సంపాదించే దిశగా కెరీర్‌ను తెలివిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోన్న విషయం తెలిసిందే. ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలతో కెరీర్‌కు బూస్ట్ ఇచ్చే రెండు హిట్స్ కొట్టేసిన ఆయన, తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 50% పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించిన విశేషాలను నాగార్జున తెలుపుతూ, చైతూ సినిమా కోసం తానూ ఎంతో జాగ్రత్తగా పనిచేస్తున్నానని తెలిపారు.

తాను హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’ స్టైల్లో మన నేటివిటీ టచ్ ఉండేలా చైతూ సినిమా ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. కళ్యాణ్ కృష్ణకు నేటివిటీ టచ్ ఇవ్వడం బాగా తెలుసని, చైతూ కెరీర్లో ఇటువంటి సినిమా ఇంతవరకూ రాకపోవడంతో ఈ సినిమా అతడ్ని కొత్తగా పరిచయం చేస్తుందని అన్నారు. మార్చి నెలాఖరుకల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని, విడుదల ఎప్పుడన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేనని ఈ సందర్భంగా నాగ్ స్పష్టం చేశారు.