టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ చెన్నై లవ్ స్టోరీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా ఎస్‌కేఎన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను జూలై 24న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే, ఇప్పుడు ఈ చిత్రానికి కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఓ భారీ చిత్రం అడ్డంకిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ డేట్‌ను కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేయడంతో జూలై 24న విజయ్ హవా నడవటం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ చివరి సినిమా కావడంతో తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ‘జననాయగన్’ పై భారీ హైప్ ఉంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ తలపడుతుండటంతో, అదే రోజు రాబోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వైపు తమిళ ప్రేక్షకుల దృష్టి మళ్లడం కాస్త కష్టమనే చెప్పాలి.
అయినప్పటికీ, ప్రధాన మార్కెట్ అయిన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గట్టి ప్రభావం చూపుతుందని నమ్ముతున్న మేకర్స్, రిలీజ్ డేట్‌ను వాయిదా వేసే ఆలోచనలో లేరు. మరి ఈ భారీ బాక్సాఫీస్ పోటీని తట్టుకుని కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
