మెగాస్టార్ స్టార్ చిరంజీవి గత రాత్రి జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు… హీరో మహేష్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి పై ప్రసంశలు కురిపించారు. ఐతే అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని అతి తక్కువ టైమ్ లో పూర్తి చేయడం ఆశ్చర్యం కలిగించింది అన్నారు. సాధారణంగా మహేష్ మూవీ అంటే నెలల తరబడి టైమ్ పడుతుందని అలాంటిది అనిల్ రావిపూడి కేవలం 80-90పనిదినాలలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి సత్తా చాటారు అన్నారు.
ఇలాంటి పరిణామాల వలన నిర్మాతకు చాలా ఖర్చు ఆదా అవుతుందన్న ఆయన తక్కువ సమయంలో మంచి అవుట్ ఫుట్ తో సినిమాలు తెరకెక్కించాలి అన్నారు. అదే సమయంలో వేదికపైనే తన 152వ చిత్ర దర్శకుడు కొరటాల శివను పిలిచి… ‘పబ్లిక్ ముందు కమిట్ అవుతున్నాను నువ్వు కూడా వంద రోజులలోపే సినిమా పూర్తి చేయాలి.. 99వ రోజు వరకు కూడా వెళ్ళకూడదు ‘ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దానిని కొరటాల శివ నవ్వుతూ అంగీకరించారు. ఇక ఆయన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో పాటు విడుదల అవుతున్న మిగతా సంక్రాంతి చిత్రాలు కూడా విజయం సాధించాలని కోరుకున్నారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయశాంతి-చిరు ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది.


