
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తండ్రి మెగా స్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని వరుస సినిమాలతో టాప్ లీగ్‌లో చేరిపోయిన స్టార్ హీరో! ప్రస్తుతం దర్శకుడు శ్రీనువైట్లతో ఓ భారీ సినిమా చేస్తోన్న చరణ్, ఈ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికీ ఒక్క పోస్టర్ కానీ, స్టిల్ కానీ విడుదల కాకపోయినా, ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. అలాంటి వార్తల్లో ఒకటే.. చెర్రీ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ చేయడం. ఈ విషయంపై పలు ఆసక్తికర కథనాలు వెలువడినా సరైనా క్లారిటీ మాత్రం ఎప్పుడూ రాలేదు.
కాగా తాజాగా చిరంజీవి ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చరణ్ సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందున్న ప్రస్తావన తనదాకా వచ్చిందని, సినిమాలో అలాంటి పాత్రకు ఆస్కారం కూడా ఉండడంతో తాను కూడా ఓకే చెప్పేశానని చిరు తెలిపారు. చెర్రీ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసే అవకాశం కచ్చితంగా ఉంటుందని, త్వరలోనే ఆ పార్ట్‌కు సంబంధించిన షూట్ జరపనున్నామని చిరు ఈ సందర్భంగా హింట్ ఇచ్చారు. ఇక చెర్రీ హీరోగా చేసిన మగధీర్ సినిమాలో కాసేపు కనిపించి మెప్పించిన చిరు, మళ్ళీ చెర్రీ నటిస్తోన్న మరో సినిమాలో గెస్ట్ రోల్ చేయనుండడం ఆసక్తికర అంశం.
భారీ బడ్జెట్‌తో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించనున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ సినిమాకు చరణ్ స్టంట్ మాస్టర్‌గా పనిచేసే తరహా సన్నివేశాలు రూపొందించారట. అంటే చెర్రీ హీరోగా తెరకెక్కే సినిమాలో తండ్రి చిరంజీవి సిసలైన హీరో పాత్రలో కనిపించి మెప్పించనున్నారన్నమాట. గతంలో శ్రీనువైట్ల సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు మళ్ళీ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.