
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. యాక్షన్ ని పెర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ని మిక్స్ చేసి చెప్పగల శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా లో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా, స్టార్ హీరోలకి డూప్ గా కనిపించే పాత్రలో కనిపించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఇటీవలే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని, కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ కూడా చేస్తున్నాడని, ఆ సాంగ్ లో చిరు సరసన ఇలియానా కూడా కాలు కలపనుందనే వార్తలు గత కొంత కాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కానీ ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టి, నిజా నిజాలను మీకు మీకందిస్తున్నాం. మేము మెగా ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం ‘రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమాలో కూడా తను స్టార్ సినిమా హీరోగానే కనిపిస్తాడు. కానీ ఇందులో ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయడం లేదు. అలాగే ఏ స్టార్ హీరోయిన్ చిరుతో కలిసి స్టెప్పులేయడం లేదని’ తెలిపారు. దీని ప్రకారం రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి కనిపించడం పక్కా అని తెలిసిపోయింది. చిరు 150వ సినిమా ఆలస్యం అయినా చిరంజీవి చరణ్ సినిమాలో కనిపించనుండడం మెగా అభిమానులకు శుభవార్త.
రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని ఆగష్టు 22న చిరు బర్త్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారు.

