‘ఎర్రబస్సు’ సినిమాలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలపై స్పెషల్ కామెడీ ట్రాక్ ను షూట్ చేశాం. ఆ సన్నివేశాలలో వేల కాకులను గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేశాం. వాటికి యానిమల్ వెల్ఫేర్ నుండి అప్రూవల్ లెటర్ కావాలని సెన్సార్ బోర్డు వారు అడిగారు. లెటర్ కోసం అప్లై చేశాం. ఒకవేళ లెటర్ రావడం ఆలస్యమయితే బ్రహ్మానందం కామెడీ ట్రాక్ లేకుండా సినిమా విడుదల చేస్తాం. విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత లెటర్ రాగానే సన్నివేశాలను సినిమాతో జత చేస్తాం అని అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. మంచు విష్ణు, కేథరిన్ త్రేసా జంటగా దాసరి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఎర్రబస్సు’. నవంబర్ 14న చిల్డ్రన్ డే కానుకగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఇంకా దాసరి మాట్లాడుతూ.. నా 45 ఏళ్ళ సినిమా కెరీర్ లో మొదటిసారిగా ఇండియా దాటి వెళ్తున్న సినిమా ఇది. ఫిల్మ్ ఫెస్టివల్ లో తప్ప ఎప్పుడు సినిమాను ఓవర్సీస్ లో విడుదల చేయలేదు. ఒకేసారి అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, కెనడా, యుకె తదితర దేశాలలో సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమాలో తాతా మనవళ్ళు ఇద్దరూ పసిబాలల మనస్థత్వం కలవాళ్ళు. అందుకే చిల్డ్రన్ డే రోజున విడుదల చేస్తున్నాం. సినిమాకు క్లాప్ కొట్టిన రోజునే నవంబర్ 14న విడుదల చేస్తాను అని చెప్పాను. యూనిట్ అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.


