
ఇప్పుడు ఎక్కడ చూసినా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మికంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సృష్టిస్తోన్న రికార్డుల ప్రస్తావనే! తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషల్లో ఏకకాలంలో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాక, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఈ సినిమాను పలువురు ప్రశంసిస్తున్నారు. రాజమౌళి విజన్, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇన్ని ప్రత్యేకతలతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ఈ సినిమాను పైరసీ అనే భూతం ఎప్పట్లానే భయపెడుతూనే ఉంది. సినిమా విడుదలైన రోజునుంచే కొన్ని వెబ్‌సైట్లలో బాహుబలి పైరసీ ప్రింట్ ప్రత్యక్షమే సినిమా యూనిట్‌ను కలవెరపెడుతోంది. ఇప్పటికే చాలావరకు కట్టడి జరిగినా, ఆన్‌లైన్ పైరసీని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయారు. దీంతో బాహుబలి టీమ్ పైరసీని అరికట్టేందుకు హైద్రాబాద్ కోర్టు నుండి ప్రత్యేక ఆర్డరు తెప్పించింది.
జాన్ డో (John Doe) పేరుతో పిలవబడే ఈ ఆర్డర్ ప్రకారం ఏయే సైట్లు పైరసీకి పాల్పడుతున్నాయన్న ఆధారాలను సేకరించారో ఆ సైట్లన్నింటినీ దేశంలో ఇంటర్‌నెట్ సర్వీసును అందిస్తున్న ప్రొవైడర్లు బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్టు నుంచి కచ్చితమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దేశంలో సుమారు 350కి పైగానే సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నాయని అంచనా!

