సూపర్ స్టార్ రజిని కాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దర్బార్. టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. అయితే దర్బార్ రిలీజ్ ఆపాలంటూ మలేషియాకు చెందిన డీఎంవై క్రియేషన్స్ సంస్థ కేసు వేసింది. దర్బార్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 2.0 సినిమా కోసమని డీఎంవై క్రియేషన్స్ సంస్థ దగ్గర రూ.12 కోట్ల అప్పు తీసుకుందట. వడ్డీతో కలిపి మొత్తం రూ.23 కోట్లు అయ్యిందని.. లైకా ప్రొడక్షన్స్ ఆ అప్పును చెల్లించట్లేదని అందుకే లైకా వారి దర్బార్ మూవీ విడుదల ఆపాలని డీఎంవై క్రియేషన్స్ సంస్థ కేసు వేసింది.
కాగా లైకా వాళ్ళు ఇది తప్పుడు కేసు అని.. అనుకున్న డేట్ కే దర్బార్ విడుదల అవుతుందని తెలిపారు. ఇక ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజిని కాంత్ చాలా కాలం తరువాత పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిని కాంత్ సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. నివేదా థామస్ కూడా ఓ రోల్ చేస్తున్నారు. రజిని నుండి వస్తున్న చిత్రం కావడంతో మూవీ పై భారీ అంచనాలున్నాయి.


