’గౌతమీపుత్ర శాతకర్ణి’ కి కథ సమకూర్చింది ఎవరు..?

gps1
అమరావతిని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథతో బాలక్రిష్ణ వందో సినిమాగా తెరకెక్కించడానికి దర్శకుడు క్రిష్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చారిత్రక చిత్రాల చిత్రీకరణ అంటే మాటలు కాదు. ఆంధ్రుల రాజవంశాలకు మూలమైన శాతవాహన వంశ చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి, శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికిన ’గౌతమీపుత్ర శాతకర్ణి’ కథ ఆధారంగా చారిత్రక నేపథ్యంలో వస్తున్నమహోజ్వలమైన ఈ రాజు జీవిత చరిత్రను దృశ్యకావ్యంగా మలచాలి అంటే ఎంతో పరిశోధన అవసరం. అయితే ఈ సినిమాకు కథను ఎవరు తయారు చేశారు అన్న సందేహం రావచ్చు? అయితే మాకు తెలిసిన సమాచారం ప్రకారం తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేసిన ఆచార్య రంగనాయకులు శాతకర్ణి చిత్రానికి కథ తయారు చేశారని తెలిసింది. చరిత్రపై ఎంతో అవగాహన ఉన్న ఆచార్య రంగనాయకులు చరిత్ర పై ఎన్నో పుస్తకాలను రాశారు.

తన 100వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పాత్ర చేయాలనుకుని, కొన్ని నెలల క్రితమే ఆచార్య రంగనాయకులుగారిని కలుసుకుని శాతకర్ణి గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరాగా ఆచార్య రంగనాయకులు పలు చారిత్రక అంశాలను పరిశీలించి శాతకర్ణికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ’గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా స్క్రిప్టు ని దర్శకుడు క్రిష్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆచార్య రంగనాయకులు ను హీరో బాలక్రిష్ణ ఆహ్వానించి సత్కరించారు. ఈ సినిమా షూటింగ్ మే మొదటివారం నుండి మొరాకో లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

Exit mobile version