డైరెక్టర్ సెల్వరాఘవన్, హీరో సూర్య కాంబినేషన్లో వచ్చిన NGK మూవీ రిలీజ్ అయ్యి దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. ఈ టాలెంటెడ్ దర్శకుడు నుండి మరో సినిమా ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్న తరుణంలో ట్విట్టర్ ద్వారా సెల్వరాఘవన్ కొత్త మూవీ అప్డేట్ తో అభిమానులకి న్యూ ఇయర్ బహుమతి ఇచ్చాడు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’. తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా విడుదలైంది. కార్తీ, రీమాసేన్, ఆండ్రియా ముఖ్య పాత్రల్లో నటించారు. పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లుగా సెల్వరాఘవన్ ప్రకటించారు.
అయితే ఈ సీక్వెల్ లో ధనుష్ హీరోగా చేయబోతున్నట్లుగా చెప్పి షాక్ ఇచ్చారు సెల్వరాఘవన్. ఈ అన్నదమ్ముల కలయికలో దశాబ్దం తర్వాత సినిమా రానుండటంతో కోలీవుడ్ లో ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉండబోతున్నాయి. ధనుష్ తన సోదరుడి ట్వీట్ కి రిప్లై ఇస్తూ…ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ మాత్రమే మాకు ఒక సంవత్సరం పడుతుంది. కానీ మాస్టర్ సెల్వరాఘవన్ కలల చిత్రమిది, తప్పకుండా అత్యద్భుతంగా ఉండబోతుంది. భారీ బడ్జెట్ లో నిర్మించబోయే ఈ సినిమాని 2024 లో విడుదలచేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
