హీరో ధనుష్‌కు లీగల్ షాక్.. రూ.20 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు..!

dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్‌కు ప్రముఖ నిర్మాణ సంస్థ తెనాండల్ ఫిల్మ్స్ షాక్ ఇచ్చింది. దాదాపు పదేళ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో ధనుష్‌కు లీగల్ నోటీసులు పంపింది. 2016లో ‘నాన్ రుద్రన్’ అనే సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ షూటింగ్ ప్రారంభించలేదని, దీనివల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని సదరు ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది.

ఈ వివాదంపై తెనాండల్ ఫిల్మ్స్ ఏకంగా రూ. 20 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తోంది. ధనుష్ తన కాల్‌షీట్లను ఇతర సినిమాలకు కేటాయిస్తూ తమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, కనీసం స్క్రిప్ట్ కూడా తమకు అందించలేదని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి పరిహారం చెల్లించకపోతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రొడక్షన్ హౌస్ హెచ్చరించడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు, ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తన 55వ చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అటు యాక్టింగ్, ఇటు మేకింగ్‌లో బిజీగా ఉన్న ధనుష్ ఈ తాజా లీగల్ నోటీసులపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Exit mobile version