భారీ లెవెల్‌లో ‘డిక్టేటర్’ యూరప్ షెడ్యూల్!

Balakrishna12
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చేస్తోన్న 99వ సినిమా ‘డిక్టేటర్’. సెట్స్‌పైకి వెళ్ళక ముందునుంచే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా విషయంలో దర్శక, నిర్మాతలు అన్నింటినీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. అంజలి, సోనాల్ చౌహాన్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా ఎరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సినిమా నిర్మాణంలో భాగమవ్వడం విశేషం.

ఇక ఇన్ని విశేషాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ నిన్ననే పూర్తైంది. మొదటి షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఇక రెండో షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. త్వరలోనే ఈ షెడ్యూల్ మొదలుకానుందని తెలుస్తోంది. ఈ యూరప్ షెడ్యూల్‌లో నాలుగు పాటలు, ఓ ఫైట్ సీన్, మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. యూరప్‌లో తెరకెక్కించే ఈ పాటలు సినిమాకు మంచి ఆకర్షణగా నిలుస్తాయని సినిమా యూనిట్ చెబుతోంది.

Exit mobile version