నితిన్ దర్శకుడినే మోసం చేశారట !

Published on Mar 2, 2021 8:13 pm IST

ఈమధ్య సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. జనాలకు మాయ మాటలు చెప్పి డబ్బులు దోచుకోవడం ఈ నేరగాళ్ల పని. ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి అమాయకులు మోసపోయిన సందర్భాలు కోకొల్లలు. వీరిలో సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు ఉండటం కూడ గమనార్హం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ‘ఛలో’ చిత్రంతో మొదటి మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుముల రెండవ సినిమా ‘భీష్మ’తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈయనకే సైబర్ నేరగాళ్లు వల వేశారు.

ఓ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్యానల్‌ సభ్యుడినంటూ రీసెంట్‌గా డైరెక్టర్‌ వెంకీ కుడుములకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘భీష్మ’ చిత్రాన్ని ఆరు కేటగిరీల్లో నామినేట్‌ చేస్తామని నమ్మబలికాడు. ఒక్కొక్క కేటగిరీకి పదకొండు వేల రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పగా ఆ వ్యక్తి మాటలు నమ్మిన వెంకీ కుడుముల ఆరు కేటగిరీలకు కలిపి ఆరవై ఆరువేల రూపాయలను డిపాజిట్ ‌ చేశారట. ఆ మరుసటిరోజు కూడ ఇంకేదో కారణం చెప్పి డబ్బులు అడగడంతో అనుమానం వచ్చిన డైరెక్టర్ ఆరా తీయగా అదొక ట్రాప్ అని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారట. పిర్యాధు అందుకున్న పోలీసులు ఫోన్ నెంబర్, అకౌంట్ వివరాలతో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :