ఏడు నంది అవార్డులు, మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకొన్న దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్రరావు తొలిసారిగా గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు. వైజాగ్‌లోని గీతం యూనివర్సిటీ ‘అన్నమయ్య’ చిత్రాన్ని రూపొందించినందుకు ఆయనకు గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రకటించింది. కెరీర్ ఆరంభంలో కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకులుగా ఎదిగిన రాఘవేంద్రరావు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత భక్తిరస చిత్రాల వైపు మళ్ళారు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘పాండురంగడు’, ‘శిరిడి సాయి’ వంటి ఆధ్యాత్మిక చిత్రాలను రూపొందించారు. ప్రేక్షకులు వీటికి బ్రహ్మరథం పట్టారు.
కె.రాఘవేంద్రరావు తెరకేక్కిచిన ఆధ్యాత్మిక చిత్రాలలో ‘అన్నమయ్య’ది ప్రత్యేక స్థానం. అప్పటివరకు శృంగార పరమైన చిత్రాలను, కమర్షియల్ చిత్రాలను రూపొందించిన రాఘవేంద్రుడు తొలిసారిగా తన బాణీ మార్చుకున్నారు. కమర్షియల్ అంశాలను పక్కన పెట్టకుండా తెలుగు తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు. గొప్ప చిత్రంగా ప్రతి ఒక్కరి ప్రసంశలను అందుకుంది. ఆ ‘అన్నమయ్య’ చిత్రం.. ఇప్పుడు రాఘవేంద్రుడుకి డాక్టరేట్ తెచ్చి పెట్టింది.


