
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘టెంపర్’. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో హీరోయిన్ మధురిమ నటించింది. మధురిమను తీసుకోవడం ఎన్టీఆర్ కు నచ్చలేదని, సెట్ లో వీరిద్దరి మధ్య సరైన సంబంధాలు లేవని, ఎన్టీఆర్, పూరిలను పట్టించుకోకుండా మధురిమ ఫోన్ లో చాటింగ్ చేసుకునేదని ఇలా పలు పుకార్లు వెబ్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. వీటిపై దర్శకుడు పూరి జగన్నాధ్ వివరణ ఇచ్చారు.
మధురిమపై వస్తున్న పుకార్లు అన్ని అబద్దాలే. ‘టెంపర్’లో మధురిమ అద్బుతంగా నటించింది. షూటింగ్ సమయంలో ఆమె మాకు బాగా సహకరించింది. నాతో సహా ‘టెంపర్’ టీం అంతా ఆమె కెరీర్ బాగుండాలని కోరుకుంటున్నాం అని సోషల్ మీడియాలో పూరి జగన్నాధ్ తెలిపారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు మంగళవారం పూర్తయ్యాయి. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

