సినిమా సినిమాకి కథలోనే కాకుండా, పాత్రల విషయంలో, లుక్ విషయంలో ఏ మాత్రం పొంతన లేకుండా వరుసగా చీనెమాలు చేస్తున్న యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డైనమైట్’. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ లాంటి విమర్శనాత్మక సినిమాలను డైరెక్ట్ చేసిన దేవకట్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు సరసన ప్రణిత హీరోయిన్ గా కనిపించనుంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఈ సినిమా పర్ఫెక్ట్ రిలీజ్ కోసం చాలా రోజులు ఎదురు చూసి అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నామని కొద్ది రోజుల క్రితమే విష్ణు అనౌన్స్ చేసారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఇంకొకటి దొరకడం వలన ఒక నెల రోజుల ముందే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం తెలిపింది. అనగా సెప్టెంబర్ 4న డైనమైట్ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్లు మంచు విష్ణు తెలియజేశాడు. డైనమైట్ లో మంచు విష్ణు ఫుల్ ఇంటెన్స్ పాత్రలో సూపర్బ్ యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ ఆకట్టుకుంటాడని సమాచారం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్ బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
