
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పవన్ మేనియా కొనసాగుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటించారు. రెండున్నర గంటల సినిమాలో పవన్ కనిపించేది కొద్దిసేపే, అయినా ఇరగదీసి నటించారనే ప్రచారం జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ సైతం దేవుడి పాత్రకు పవన్ సరిగ్గా సూటయ్యారని.. కళ్ళలో కరుణ, దైవత్వం, ఆధ్యాత్మిక భావాలను చక్కగా చూపారని కితాబు ఇచ్చారు. సినిమాలో మొత్తం మూడు పాటలు ఉన్నాయి. రెండు పాటల్లో పవన్ హైలైట్ గా నిలుస్తారని సమాచారం. ఓ పాటలో కాస్త డాన్సు చేశానని పవన్ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.
సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానులలో సినిమాపై అంచనాలు మిన్నంటుతున్నాయి. గోపాలుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీలలు తెరపై ఎప్పుడెప్పుడు కళ్ళారా చూద్దామా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రేజ్ పీక్స్ లో ఉంది. ‘పవనిజం’ పేరుతో అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన్ను ఓ దేవుడిలా కొలుస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆ అభిమానం మరింత ఎక్కువ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.