ఇంటర్వ్యూ : దర్శకుడు వి.మునిరాజు – ‘తిమ్మరాజుపల్లి టీవీ’లోని సస్పెన్స్ ఇంప్రెస్ చేస్తుంది..!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ హైలైట్స్ గురించి దర్శకుడు వి.మునిరాజు మీడియాతో ముచ్చటించారు.

– దర్శకుడు కావాలనే నా కల కోసం, ఆన్‌లైన్ ఎడిటింగ్ వదిలి నా సొంత ఊరిలో ఒక డెమో షూట్ చేశాను. ఆ వీడియో చూసిన కిరణ్ అబ్బవరం గారు, నా కథ నచ్చి సినిమా చేద్దామని ప్రోత్సహించారు. అలా ఆయన మద్దతుతో నా మొదటి చిత్రం “తిమ్మరాజుపల్లి టీవీ” పట్టాలెక్కింది.

– నా చిన్ననాటి జ్ఞాపకాలు, మా ఊరికి మొదటిసారి టీవీ వచ్చినప్పుడు కలిగిన ఆ వింత అనుభూతే “తిమ్మరాజుపల్లి టీవీ” కథాంశం. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారికి ఈ సినిమా పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఊరి మనుషుల మధ్య ఉండే అహంకారాలు, అనుబంధాలను చూపిస్తూనే, ఒక బలమైన ఎమోషనల్ ముగింపుతో ఈ చిత్రాన్ని రూపొందించాను. నా ఊరి కథను వెండితెరపై ఆవిష్కరించాలనే తపనే ఈ సినిమా.

– ఈ తరం జెన్ జీ కిడ్స్‌కు కూడా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ బాగా నచ్చుతుంది. అప్పటి మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు జీవనశైలి తెలియని నేటి పిల్లలకు ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. వారు చూడని పాతకాలపు వాతావరణం, ఆసక్తికరమైన విషయాలు ఈ మూవీలో వారిని తప్పకుండా ఆకట్టుకుంటాయి.

– ఇది పక్కా సస్పెన్స్ డ్రామా. ఆరంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠను రేకెత్తిస్తూ, క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ ఫీల్‌ను అందిస్తుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథను మా ఊరైన తిమ్మరాజుపల్లి రియల్ లొకేషన్స్‌లోనే చిత్రీకరించాం. సినిమాలోని పాటలన్నీ కూడా మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే షూట్ చేయడం విశేషం.

– ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రాన్ని అత్యంత సహజంగా, రియలిస్టిక్ అప్రోచ్‌తో తెరకెక్కించాను. ఇందులో ఆరేడు నిమిషాల నిడివి గల సింగిల్ టేక్ సీన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. నిర్మాత కిరణ్ అబ్బవరం నాపై ఉంచిన నమ్మకమే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం. ఒక కొత్త తరహా ‘న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్’గా ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నాను.

– ఈ సినిమాలో ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన నటులు మరియు సురభి వంటి నాటక రంగ కళాకారులు నటించారు. నాలాంటి ఎంతోమంది కొత్త వాళ్ల కల ఈ చిత్రం. ఈ సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీలో మరికొంతమంది కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే మా సన్నిహితులకు వేసిన షోస్ ద్వారా మంచి స్పందన లభించింది, నేను చెప్పాలనుకున్న పాయింట్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.

– నటీనటుల పనితీరు, సాంకేతికత ఈ సినిమాకు ప్రధాన బలం. హీరో హీరోయిన్లతో పాటు ప్రతి పాత్ర కథలో ఎంతో కీలకంగా ఉంటుంది. టెక్నికల్ పరంగా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి పాట వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేశాం. ప్రస్తుతం నా దగ్గర మరో ఐదు కథలు సిద్ధంగా ఉన్నాయి, మన చుట్టూ ఉండే వాస్తవిక గాథలనే వెండితెరపై ఆవిష్కరించడమే నా లక్ష్యం.

Exit mobile version