ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ఉద్భవ్ రఘునందన్ – నాకు కూడా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే..

Published on Nov 19, 2020 5:28 pm IST

మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ “ఆహా”లో రీసెంట్ గా వచ్చి మంచి అటెన్షన్ ను తెచ్చుకున్న ఎంటర్టైనింగ్ షో “కమిట్ మెంటల్” అయితే ఇందులో మెయిన్ లీడ్ లో చేసిన చికాగో సుబ్బారావ్ ఫేమ్ ఉద్భవ్ రఘునందన్ తో ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాము. మరి అతను ఎలాంటి విశేషాలు పంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

కమిట్ మెంటల్ షో కు రెస్పాన్స్ ఎలా ఉంది?

మొదటి రోజు అయితే అనుకున్నంత రెస్పాన్స్ ఏం రాలేదు. చాలా డల్ గా వచ్చింది. కానీ తర్వాత మాత్రం మెల్లగా చాలా మంది చూడటం మొదలు పెట్టారు. ఇప్పుడు సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది.

ఈ షోకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?

ఈ షో చూసాక నిర్మాత అల్లు అరవింద్ గారు నాతో చాలాసేపు మాట్లాడి నా వర్క్ ను మెచ్చుకున్నారు. అలాగే ఆయన తనకు పెద్దగా ఎక్కువ ఊహించుకోకుండానే చూశానని కానీ నా రోల్ తో ఆయన్ను ఆశ్చర్యపరిచానని అన్నారు. అది నాకు నా కెరీర్ కు పెద్ద బూస్టప్ లా అనిపించింది.

ఈ మీకు ఆఫర్ ఎలా వచ్చింది?

చికాగో సుబ్బారావ్ చేస్తున్నపుడు నేను తమడా మీడియా వాళ్ళతో టచ్ లో ఉన్నాను. ఇది పర్మనంట్ రూమ్ మేట్స్ కు రీమేక్ అయినప్పటికీ టీవీఎఫ్ వారు తమడా మీడియా వారిని అప్రోచ్ అయ్యారు. దానితో వారు నా పేరును రెఫర్ చెయ్యడంతో నాకు ఈ ఆఫర్ వచ్చింది.

మీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్తారా?

నేను హైదరాబద్ కు చెందిన వాడినే. అలాగే నా 13 సంవత్సరాల వయసు నుంచే యాక్టర్ కావాలని కోరుకున్నాను. అలాగే నేను కూడా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని ఆయన్ను చూసే నటుణ్ని కావాలని ఫిక్సయ్యాను. ఇంకా నాకు కాస్త సిగ్గు ఎక్కువ అందుకే అద్దంలో చూసుకొని పెర్ఫామ్ చేసుకునే వాడిని. నా చదువు అయ్యాక ఓ షార్ట్ ఫిలిం కూడా తీసా అది నా తల్లిదండ్రులకు కూడా నచ్చలేదు. ఆ తర్వాత యూఎస్ లో మాస్టర్స్ చెయ్యడానికి వెళ్ళిపోయాను అంతే.

చికాగో సుబ్బారావ్ ను ఎందుకు లాంచ్ చేశారు?

నేను నా కాలేజ్ లైఫ్ లో ఏమాత్రం హ్యాపీగా లేను. నాపాటికి యాక్టర్ అవుదామని అనుకుంటే నన్ను ఇక్కడికి ఎందుకు పంపారని మా అమ్మతో ఎప్పుడు ఫోన్ లో అంటుండే వాడిని. అక్కడ కూడా చాలా కష్టాలే పడ్డాను. అలా ఆ టైం లో మొదలు పెట్టిన షార్ట్ ఫిల్మే చికాగో సుబ్బారావ్. ఒక్కసారిగా అది క్లిక్ అవ్వగానే ఇంకా మరిన్ని చేశాను. అది కాస్తా ఇప్పుడు బ్రాండ్ అయ్యింది.

ఫుల్ టైం యాక్టర్ అవ్వాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు?

ఇక నా బ్రాండ్ కి మంచి పాపులారిటీ వచ్చాక నా ఛానెల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాను. ఆ టైం లోనే నాకు మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ నేను యూఎస్ లో ఉండిపోవడం వల్ల చాలా మిస్సయ్యిపోయాను. ఓసారి అయితే స్వప్న దత్ తో చెయ్యాల్సింది కుదరలేదు. అలాగే ఈ నగరానికి ఏమైంది కూడా చెయ్యాల్సి ఉంది అది కూడా అక్కడ ఉండిపోవడం వల్లే కోల్పోయాను. ఇక ఇలా అయితే లాభం లేదని ఫుల్ యాక్టర్ అయ్యిపోవాలని 2018లో ఇండియాకు వచ్చేసాను.

పునర్నవితో వర్క్ ఎలా అనిపించింది?

ఆమెతో వర్క్ చాలా గ్రేట్ అనిపించింది. షూటింగ్ సమయంలో తాను చాలా హెల్ప్ ఫుల్ గా ఉండేది. అలాగే నా మేకప్ విషయంలో కూడా కేర్ తీసుకొనేది. మాకు మేము పెద్దగా తెలియని సమయంలోనే ఒక డిన్నర్ కు వెళ్ళాం అప్పుడు బాగా తెలుసుకున్నాం. తాను తన రోల్ లో బాగా చేసింది. నేను కూడా తనతో మరిన్ని సార్లు పని చెయ్యాలని కోరుకుంటున్నా.

పవన్ సాధినేనితో వర్క్ ఎలా ఉంది?

ఒక ఇనోసెంట్ అండ్ అమాయకత్వం కలిగిన రోల్ ఇది అలాగే చాలా సెన్సిటివ్ లైన్ కూడా. దానిని పవన్ మాత్రం అద్భుతంగా చేసాడు. అతడు చాలా విషయాలను సింపుల్ చేసేసాడు. అతని కామెడీ అండ్ రోల్ ఈ షోకు బాగా హైలైట్ అవుతాయి.

మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది?

మా అమ్మ నన్ను ఎప్పుడు యూఎస్ లోనే చూడాలనుకొనేవారు. అది తీర్చేసాను. తర్వాత తిరిగి వచ్చాక కూడా వారు హ్యాపీ అయ్యారు. కానీ సినిమా ఫీల్డ్ అనే సరికి కాస్త భయపడ్డారు. తర్వాత నాకు చాలా స్వేచ్ఛను ఇచ్చేసారు. దాంతో అక్కడ నుంచి నా షోలతో మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాను.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ఇప్పుడు సినిమాలు అలాగే స్మాల్ స్క్రీన్ నుంచి కూడా డీసెంట్ ఆఫర్స్ వస్తున్నాయి. తొందరలోనే కొన్నింటికి ఓకే చేస్తాను. అలాగే వచ్చే నెలలో నా నుంచి ఒక స్పెషల్ వస్తుంది అదేంటో అప్పుడు చూద్దురు.

సో ఇలా ఉద్భవ్ తో మా ఇంటర్వ్యూ ముగిసింది. అలాగే తన కెరీర్ కు కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నాం.

సంబంధిత సమాచారం :