ఇంటర్వ్యూ : ‘ఫలక్ నుమా దాస్‘ ఉత్కంఠ రేపే థ్రిల్లింగ్ మూవీ !

Published on May 30, 2019 4:51 pm IST

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం దర్శకుడిగా మారి ‘ఫలక్ నుమా దాస్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలు పెంచేశాయి. రేపు ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనున్న తరుణంలో విశ్వక్‌ సేన్‌ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

 

మీకు సినిమాలలోకి రావడానికి పురిగొల్పిన సంధర్భాలేమిటి ?

నేను యానిమేషన్ కోర్స్ చేశాను. నాకు మొదటి నుంచి మూవీ నిర్మాణం అన్నా, దర్శకత్వం అన్నా నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చాను. నటుడ్ని అయ్యాను. ఇప్పడు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది.

 

‘ఫలక్ నుమా దాస్’ ఎప్పుడు కార్యరూపం దాల్చింది ?

నేను “పలక్ నుమా దాస్” మూవీ మొదలు పెట్టిన ఇరవై రోజులు తరువాత.. అనుకోకుండా నాకు “ఈ నగరానికి ఏమైంది?” మూవీలో నటించే అవకాశం వచ్చింది. నా మూవీని వదిలేసి, “ఈ నగరానికి ఏమైంది? మూవీలో నటించాను. ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే, నేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ మూవీని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాను.

 

‘ఫలక్ నుమా దాస్’ అనే పేరే ఎందుకు పెట్టారు ?

ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ, చాలావరకు మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడం జరిగింది. ఈ సినిమా నేపధ్యం మొత్తం హైదరాబాద్ పాతబస్తీ పరిసరాలలో జరుగుతుంది. అందుకే మూవీకి “పలక్ నుమా దాస్” అనే పేరుపెట్టాము.

 

మీరు ఈ సినిమాలో నటించారు, నిర్మాతగా వ్యవహరించారు, దర్శకత్వం వహించారు. వీటిలో మీకు ఏ పని కష్టమనిపించింది ?

నా అభిప్రాయంలో నిర్మాణం చాల ఇబ్బందులతో కూడిన వ్యవహారం. ప్రతి ఒక్కరిని మేనేజ్ చెయ్యడం, అనుకున్న సమయానికి అన్ని పనులయ్యేలా చూడడటం అనేది చాలా కష్టం. ఇక నటన,దర్శకత్వం అంటారా, సహజంగానే నాలో ఇమిడి ఉన్నవి, దాంతో అవి నాకు ఇబ్బందిగా అనిపించవు.

 

ఈ రీమేక్ మూవీలో మార్పులు చేశారా ? ఫుర్తిగా ఒరిజినల్ మూవీనే ఫాలో అయ్యారా ?

దాదాపు 50% ఒరిజినల్ కథకి మార్పులు చేయడం జరిగింది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు, సునిశిత పరిశీలతో గొప్పగా నిర్మించాం. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు ఉత్కంఠత అనుభవిస్తాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది అంతుపట్టకుండా ఉంటుంది.

 

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని ఓ పాత్రలో నటింపచేయడానికి కారణమేంటి ?

మీకు బహుశా తెలియకపోవచ్చు, ఆయనొక టాప్ క్లాస్ యాక్టర్. “ఏమైంది ఈ నగరానికి?” మూవీ ఆయనతో చేసేటప్పుడు ఈ విషయం నేను గమనించాను. అందుకే కావాలనే నా మూవీలో ఆయనతో ఓ రోల్ చేయించాను. ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

 

మీరు రఫ్ గా ఉండే మాస్ రోల్స్ మాత్రమే ఎంచుకుంటున్నారు ఎందుకని ?

వాస్తవం చెప్పాలంటే, నాకు అలాంటి పాత్రలు చేయడానికి అవకాశం వచ్చింది, చేశాను. కానీ నా నెక్స్ట్ మూవీ కార్టూన్ లో మాత్రం నా రోల్ చాలా కామెడీ పండిస్తుంది, ఆడియన్స్ ని థ్రిల్ కి గురిచేస్తుంది.

 

ఈ మూవీ విజయం పై మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనుకుంటా ?

ఈ సినిమా మొదలుపెట్టిన మొదటి రోజునుండే చిత్ర విజయం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అరగంటలో మూవీ ప్రీమియర్ షో టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి, ఈ సినిమా పై ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం.

సంబంధిత సమాచారం :

More