పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ స్టార్ అవతారమెత్తనున్నారు. ఈ నెలలోనే అయన ఈ ఎంట్రీ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. పవన్ చేయబోయేది ‘పింక్’ సినిమా రీమేక్ అని, దీనికి వేణు శ్రీరామ్ దర్శకుడని, త్రివిక్రమ్ మాటలు రాస్తారని ప్రచారంలో ఉంది. పవన్ రీఎంట్రీపై మిగతా జనం ఏమనుకున్నా ఆయన అభిమానుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు ఫ్యాన్స్ పవన్ సినిమాల్లోకి రావడం సరైన నిర్ణయమేనని, ఆయన్ను మరోసారి వెండితెరపై చూసే అవకాశం ఉంటుందని సంబరపడుతున్నారు. అంతేకాదు పవన్ రాజకీయాల్లో ఉండి సినిమాలు చేసుకోవడంలో తప్పేమీ లేదని, అది అయన వృత్తి అని, మిగతా పొలిటీషియన్స్ ఎవరి వ్యాపారాలు వాళ్లు చేసుకోవడం లేదా, పార్టీని నడపాలంటే డబ్బు కావాలి, అందుకు పవన్ వద్ద ఉన్న ఒకే ఒక సోర్స్ సినిమాలు చేయడమేనని అంటున్నారు.
ఇంకొంతమంది ఫ్యాన్స్ మాత్రం పవన్ ఇదివరకే సినిమాలు మానేశానని, ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ సినిమాలు చేయనని తెలిపారని, అలాంటిది మళ్లీ ఇప్పుడు సినిమాలంటే జనం ఏమనుకుంటారు, ఇప్పటికే రాజకీయాలకు అయన సమయం సరిపోవట్లేదు, అలాంటిది సినిమాలు కూడా అంటే పార్టీ కార్యాకలాపాలకు అంతరాయం అని, పైగా ఈ అంశం మీద ప్రత్యర్థుల దాడి కూడా ఉంటుందని ఇంకో వెర్షన్ చెబుతున్నారు. మరి పవన్ ఒకవేళ సినిమా ప్రకటన చేస్తే అందరినీ కన్విన్స్ చేసేలా ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.


