దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. యావత్ దేశం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక గతంలో ఒకసారి వాయిదాపడిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న భారీ సంఖ్యలో హాజరైన అభిమానుల సమక్షంలో తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆడియో ఆవిష్కరణ వేడుక నిర్వహణలో ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం చూపే దర్శక ధీరుడు రాజమౌళి ఈసారి కూడా అంతే కొత్తదనంతో వైవిధ్యంగా ఈ వేడుకను నిర్వహించారు.
‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకకు ప్రత్యేక అతిథులంటూ ఎవ్వరినీ ఆహ్వనించలేదు. కేవలం బాహుబలి సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్ల సమక్షంలోనే ఈ వేడుక వైవిధ్యంగా జరిగింది. నటీనటులు, టెక్నీషియన్లు తమ తమ అనుభవాలను, అనుభూతులను పంచుకోవడానికి బాహుబలి ఆడియో వేడుక సరైన వేదికగా పనిచేసింది. ఈ సినిమాకు పనిచేసిన వారంతా, తాము ఇలాంటి సినిమాలో భాగమైనందుకు గర్వపడుతున్నామని తెలియజేశారు. ఇక ఇదే వేడుకలో రాజమౌళి, అడివి శేష్, రానా, రమ్యకృష్ణ లాంటి తారలు భావోద్వేగానికి గురికావడం విశేషంగా కనిపించింది.
సినిమాలో ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, అడివి శేష్లతో పాటు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నిర్మాతలు శోభు యార్కగడ్డ, దేవినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


