హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా, ఇప్పుడా సిరీస్‌లో మూడో సినిమా ‘గంగ(ముని 3)’ నిన్నే విడుదలైంది. ‘గంగ’ తమిళ వర్షన్ ‘కాంచన 2’ గత నెల 17నే విడుదలైనా తెలుగులో మాత్రం కొన్ని ఆర్ధిక కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఇక అన్ని ఇబ్బందులని ఎదుర్కొని నిన్న మేడే కానుకగా తెలుగులో విడుదలైంది.
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగ’ సినిమాకు తెలుగులో మంచి స్పందనే వచ్చింది. ఔట్ అన్డ్ ఔట్ మాస్ సినిమాగా తెరకెక్కిన ‘గంగ’.. టార్గెట్ ఆడియన్స్‌ని అమితంగా ఆకట్టుకుంటోంది. మేడే సెలవు దినం కూడా కావడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా యూనిట్ వర్గాలు తెలిపిన ప్రకారం అన్ని ప్రాంతాలను కలుపుకొని ఈ సినిమా మొదటిరోజు సుమారు రూ. 3.55కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిందని తెలుస్తోంది. నైజాంలో ఈ సినిమా 1.1కోట్ల రూపాయలను సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా లభించడంతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యా మీనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో వారి యాక్టింగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే!


