ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూలై 31, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ 2.5/5
నటీనటులు : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, రమ్యకృష్ణ
దర్శకత్వం : చెల్లా అయ్యవు
నిర్మాతలు : డాక్టర్ ఐసరి కె. గణేష్ & విష్ణు విశాల్
సంగీతం : షాన్ రోల్డన్
ఛాయాగ్రహణం : కె.ఎమ్. భాస్కరన్
కూర్పు : భరత్ విక్రమన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గట్టా కుస్తీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘గట్టా కుస్తీ 2’తో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో థియేట్రికల్ రిలీజ్ చేసుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇక ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
మొదటి సినిమా సంఘటనలు జరిగిన ఆరేళ్ల తర్వాత, వీరా (విష్ణు విశాల్) ఇంటి బాధ్యతలు స్వీకరించి, తన భార్య కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) రెజ్లింగ్ కెరీర్‌ను కొనసాగించడానికి ప్రోత్సహిస్తాడు. అయితే, ఆమెపై అసూయపడే కోచ్ (తారక్ పొన్నప్ప) వీరాను తప్పుదోవ పట్టించి కీర్తి ఒక ముఖ్యమైన మ్యాచ్‌ను కోల్పోయేలా చేస్తాడు. దీంతో ఆమె సస్పెండ్ అవుతుంది. తన కెరీర్ నాశనమవ్వడానికి తన భర్తే కారణమని నిందిస్తూ కీర్తి అతనికి దూరంగా ఉంటుంది. ఈ జంట మళ్లీ కలుస్తుందా? కీర్తి తన రెజ్లింగ్ కెరీర్‌ను తిరిగి నిలబెట్టుకోగలదా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
విష్ణు విశాల్ మరోసారి ఈ సినిమాకు అతిపెద్ద బలంగా నిలిచాడు. కథనం ఎక్కడ నెమ్మదించినా అతని సహజమైన కామిక్ టైమింగ్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. ఇరుగుపొరుగు వారితో అతని సంభాషణలు, అలాగే అతని కూతురుతో ఉన్న సన్నివేశాలు మెప్పిస్తాయి.
ఐశ్వర్య లక్ష్మికి కాస్త లిమిటెడ్ పాత్ర దక్కినప్పటికీ, తన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో హాస్యానికి పెద్దగా ఆస్కారం లేకపోయినా, తన లక్ష్యాలను చేరుకోవాలనుకునే ఒక రెజ్లర్ పడే ఎమోషనల్ సంఘర్షణలను, పట్టుదలను ఆమె అద్భుతంగా పండించింది. విష్ణు విశాల్ మరియు ఐశ్వర్య లక్ష్మిల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా సెకండాఫ్‌లో బాగా కుదిరింది.
చైల్డ్ ఆర్టిస్ట్ జారా జియన్నా సర్ప్రైజ్ చేస్తుంది. ఆమె నటన చాలా సహజంగా ఉంది. మునీష్ కాంత్, మోక్ష తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
‘గట్టా కుస్తీ 2’కి మేజర్ డ్రా బ్యాక్ రొటీన్ కథ. భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం, చివరికి ఎమోషనల్‌గా మళ్లీ కలవడం వంటి కథాంశాలు చాలా సినిమాల్లో చూశాం. దీనివల్ల కథనం పెద్దగా ఆశ్చర్యపరచదు. నెక్స్ట్ ఏం జరగబోతుందో సులభంగా ఊహించవచ్చు. ఒక రెజ్లర్ చుట్టూ కథ తిరుగుతున్నప్పటికీ, సినిమా క్రమంగా ఫ్యామిలీ కలహాల వైపు మళ్ళుతుంది. స్పోర్ట్స్ నేపథ్యాన్ని సినిమాలో పెద్దగా వాడుకోలేదు.
కథ పాత పద్ధతిలోనే సాగడం వల్ల ప్రేక్షకులను కట్టిపడేయడానికి సినిమా ఎక్కువగా కామెడీ పై ఆధారపడింది. దురదృష్టవశాత్తూ చాలా వరకు కామెడీ వర్కౌట్ కాలేదు. కొన్ని సన్నివేశాలు థియేటర్లలో బాగానే అనిపించినా, ఓటీటీలో వాటి ప్రభావం తగ్గింది. చాలా జోకులు సాగదీసినట్లు అనిపిస్తాయి.
ప్రీ-క్లైమాక్స్ కోర్ట్‌రూమ్ సీన్ ద్వారా ఎమోషన్ మరియు మెసేజ్ రెండూ ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ అది అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తుంది.
క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా సరిగా వాడుకోలేదు. రమ్యకృష్ణ అతిథి పాత్ర కథకు పెద్దగా ఉపయోగపడలేదు. ఆమె పాత్ర అనవసరం అనిపిస్తుంది. అదేవిధంగా తారక్ పొన్నప్ప, కాళీ వెంకట్, యోగి బాబు వంటి నటులకు వీక్ పాత్రలు ఇవ్వడం వల్ల తమ సత్తా చాటుకునే అవకాశం దక్కలేదు.
ఇలాంటి రొటీన్ కథ ఆసక్తికరంగా సాగాలంటే పకడ్బందీ స్క్రీన్‌ప్లే, తక్కువ రన్‌టైమ్ ఉండాలి. కానీ, ఈ సినిమా దాదాపు రెండున్నర గంటల పాటు సాగదీయడం తో ఈ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది.
సాంకేతిక వర్గం:
దర్శకుడు చెల్లా అయ్యవు మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ కాంబినేషన్‌ను నమ్ముకున్నాడు. కానీ మొదటి సినిమాలో ఉన్నంత కొత్తదనం ఇందులో లేదు. ఇంకాస్త మెరుగైన స్క్రిప్ట్, పదునైన కథనం ఉండి ఉంటే సినిమా స్థాయి కచ్చితంగా పెరిగేది. షాన్ రోల్డన్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. భరత్ విక్రమన్ ఎడిటింగ్ వీక్‌గా ఉంది. కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉండాల్సింది. కె.ఎం.భాస్కరన్ సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ వర్క్ పర్వాలేదు.
తీర్పు:
మొత్తంగా చూస్తే, రొటీన్ ఫ్యామిలీ డ్రామా చిత్రంగా వచ్చిన ‘గట్టా కుస్తీ 2’ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. స్పోర్ట్స్ నేపథ్యం ఉన్నా, వీక్ రైటింగ్‌తో కథను ట్రాక్ తప్పించారు. విష్ణు విశాల్-ఐశ్వర్య లక్ష్మిల పర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. అయితే, రొటీన్ కథ, సాగదీసిన రన్‌టైమ్ ఈ చిత్రానికి మైనస్. టైమ్ పాస్ కోసం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని ఓసారి ట్రై చేయవచ్చు. మిగతా వారు ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


