క్రికెట్, సినీ ప్రియులకు ముఖ్యంగా సచిన్ అభిమానులకు ఓటీటీ వేదిక ఆహా ఓ శుభవార్త తెలిపింది. సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ పేరుతో సచిన్ స్టోరీ రాబోతుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ ను షేర్ చేసింది. ‘ఒక కల, బ్యాట్, యావత్ ప్రపంచాన్ని ఉత్తేజపరిచిన ప్రయాణం.. క్రికెట్‌కు దేవుడిగా మారిన వ్యక్తి కథ.. సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ త్వరలోనే ఆహా వేదికగా మీ ముందుకు రాబోతుంది’ అని పోస్ట్ ను షేర్ చేశారు.
అయితే, 2017లో ఇదే పేరుతో సచిన్ పై ఓ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే డాక్యుమెంటరీ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుందా..?, లేదంటే మరో కొత్త సిరీస్ లాంటిది ఏమైనా తెరకెక్కిస్తున్నారా ? అనేది చూడాలి. జేమ్స్ ఎర్స్‌కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’లో సచిన్ చిన్నతనం నుంచి ఆయన రిటైర్మెంట్ వరకూ జరిగిన అనేక సంగతులను ఈ డాక్యుమెంటరీలో క్లారిటీగా చూపించారు.
