అల్లరి నరేష్ సినిమాలంటే కామెడీకి ఓ సరికొత్త బ్రాండ్. కామెడీని తనదైన స్టైల్లో ప్రెజెంట్ చేస్తూ, తన బ్రాండ్‌ను మరింత పెంచుకుంటూ వచ్చిన నరేష్ ఈమధ్య కాలంలో మాత్రం తనదైన సినిమా చేయలేకపోయారు. ఈమధ్య కాలంలో నరేష్ సినిమాలు ఇటు బాక్సాఫీస్ పరంగానూ, అటు ఆయన ట్రేడ్ మార్క్ పరంగానూ నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘జేమ్స్ బాండ్’ ఆ లోటును తీర్చే సినిమాగా మొదట్నుంచీ ప్రచారం పొందుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం పరిచయమయ్యారు.
గత రెండు వారాలుగా బాహుబలి సినిమా తప్ప మరో సినిమా విడుదల కాని నేపథ్యంలో శుక్రవారం విడుదలైన జేమ్స్ బాండ్ సినిమా అల్లరి నరేష్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్నిచోట్లా ఈ అల్లరి మార్క్ ఎంటర్‌టైనర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ సినిమాలకు ఎప్పుడూ రానంతగా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. జేమ్స్ బాండ్.. ‘నేను కాదు నా పెళ్ళాం’ అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సినిమాలో సాక్షి చౌదరి అల్లరి నరేష్‌ను ఇబ్బందుల్లో పడేసే భార్యగా నటించింది. సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ కెరీర్‌కు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే కావడం విశేషం.
ఇక ఈ సినిమాకు దక్కుతున్న ఆదరణ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సినిమా యూనిట్ నిన్న ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు సాయి కిషోర్, హీరో అల్లరి నరేష్, హీరోయిన్ సాక్షి చౌదరి తదితరులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్, సాటిలైట్ రెవెన్యూ అన్నీ కలుపుకుంటే నిన్నటితో సినిమా బ్రేక్ ఈవెన్‌ను చేరుకుందని, సోమవారం నుంచి సినిమా లాభాల బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయని అల్లరి నరేష్ ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా నేటినుంచి ఏపీలోని పలు ప్రధాన నగరాల్లో రెండు రోజుల పాటు సక్సెస్ టూర్ నిర్వహించనున్నారు.


