మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచిన చిత్రం ‘గౌతమ్ నంద’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఈ చిత్రాన్ని జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. జె.భగవాన్ మరియు జె.పుల్లారావు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించాడు. ‘ధనం మూలం ఇదం జగత్’ అనే బలమైన పాయింట్‌తో రూపొందిన ఈ మూవీలో గోపీచంద్ నటన మరియు లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
జెబి ఎంటర్టైన్మెంట్స్ మరియు పికె ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నాయి. కమర్షియల్ హంగులతో పాటు మంచి సందేశం ఉన్న ‘గౌతమ్ నంద’ను మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


