
దర్శకుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న గౌతమ్ మీనన్, తెలుగులో మొదటి సారి నిర్మాతగా మారి ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ పేరుతో ఓ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. వరుస హిట్లతో జోరు మీదున్న నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ప్రస్తుతం అన్ని ఇబ్బందులనూ అధిగమించి సెప్టెంబర్ రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.
హీరోగా నితిన్‌కి ఉన్న క్రేజ్, గౌతమ్ మీనన్ సినిమాలంటే ఉండే ఆసక్తి ఈ సినిమాపై అంచనాలను రేకెత్తించినా, సినిమా విడుదల విషయంలో లేట్ అవ్వడంతో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’పై ఆసక్తి సన్నగిల్లింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు దగ్గరైపోవడం, ఈ మధ్యే విడుదలైన ఆడియో, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం వంటి అంశాలతో ఈ సినిమాపై మళ్ళీ అంచనాలు మొదలయ్యాయ్. గౌతమ్ మీనన్ ఈ సినిమాపై మొదట్నుంచీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆడియోకు వస్తోన్న స్పందన పట్ల ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ అందించిన ట్యూన్స్ వినగానే చాలా బాగా నచ్చాయని, అవే ట్యూన్స్ సాంగ్స్ అయ్యాక ఇంకా బాగున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నితిన్ సరసన యామీ గౌతమ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.