
గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన రుద్రమదేవి సినిమా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని అక్టోబర్ 9న తెలుగు, హిందీ, మళయాలం భాషల్లో భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. కాకతీయ సామ్రాజ్య వీరనారి రాణీ రుద్రమదేవి కథ కావడం, భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమా కావడం అనుష్క, అల్లు అర్జున్, రానా లాంటి భారీ తారాగణం నటించడం వంటి కారణాలతో సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమాపై ఇతర భాషల్లో కూడా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగుతో పాటు హిందీ, మళయాలంలోనూ సినిమాను విడుదల చేశారు. కాగా తమిళంలో మాత్రం ఈ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేసేందుకు తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తోన్న థెండాల్ ఫిల్మ్స్ ప్లాన్ చేసింది. ఇక సినిమా విడుదలకు మూడు రోజులే ఉండడంతో తమిళంలో రుద్రమదేవి ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
ఇప్పటికే తెలుగులో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తమిళంలోనూ అదేస్థాయిలో అలరిస్తుందని సినిమా యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు తమిళంలోనూ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సుమారు 350 నుండి 400 స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఒక తెలుగు సినిమాకు ఈ స్థాయి స్క్రీన్ కౌంట్ లభించడం విశేషంగానే కనిపిస్తోంది.