కేవలం న్యూస్ పేపర్ మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో తనలోని మేధస్సుకి పదును పెట్టి వినూత్న ఆలోచనతో టాలీవుడ్ లో మొట్ట మొదటిసారిగా ‘సూపర్ హిట్’ అనే తెలుగు సినీ వార పత్రికను స్థాపించి, దాన్ని 30 ఏళ్ళుగా సక్సెఫుల్ గా రన్ చేస్తున్న ఘనత తెలుగు మీడియాకి రారాజుగా పిలుచుకునే ఒక్క బిఎ రాజుకి మాత్రమే దక్కింది. సినీ ప్రపంచం అనేది ఒక ఓ గ్లామర్ ప్రపంచం. ఈ గ్లామర్ రంగంలో ఎలాంటి చెడు అలవాట్లను అలవరుచుకోకుండా, ముఖంపై చెరగని చిరునవ్వుతో, ఎప్పుడూ తన పనిలో కొత్తదనం ఏమి చూపించాలి, నిర్మాతలు తనకు ఇచ్చిన బాధ్యతను ఎంత విజయంతంగా పూర్తిచేయాలి అని నిరంతరం కృషి చేసే వ్యక్తి బిఎ రాజు. ఈ సినీ ప్రపంచంలో ఎంత పెద్ద హీరో నటించినా, ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా, నిర్మాత డబ్బు ఎంత పెట్టినా ఆ సినిమా ప్రజలకి చేరువవ్వాలి అంటే ఉన్న ఏకైక దారి మీడియా. అలాంటి మీడియాలో మకుటం లేని మహారాజుగా ముప్పై ఏళ్ళు రాణించడం అంటే అంత ఆషామాషీ కాదు. ఆ ఘనత కూడా ఒక్క బిఎ రాజుగారికే దక్కింది.
చదువు పూర్తిచేసుకొని ఆంద్రభూమి పత్రికలో జర్నలిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన సినిమాలపై ఉన్న ప్రేమతో మొట్ట మొదటి సారిగా సూపర్ హిట్ అనే సినీ పత్రికని ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన ఎంత బిజీగా ఉన్నా తన సూపర్ హిట్ పత్రిక పరచురణ టైంకి ఎంత ఆలస్యమైనా కూర్చొని అన్నీ చక్కబెట్టి ప్రింటింగ్ కి పంపిస్తారు. ప్రతిరోజు ఉదయం ఆయన ఇంటి నుంచి మొదలయ్యే ఆయన ప్రయాణం ఎంతోమంది స్టార్ హీరోలను కలుసుకొని, సినిమా ప్రమోషన్స్ గురించి ఎన్నో మంతనాలు చేసి, ఆ విషయాలను మీడియా మిత్రులకు చేరవేసి లేదా మీడియా మిత్రులను కలిసి కాస్త సమయం వాళ్ళతో గడిపి ఇంటికి చేరుతారు. ఈ జర్నీ గత 30 ఏళ్ళుగా సాగుతున్నా ఆయనకు అలసట లేదు, ఉన్నదల్లా నేను సినిమా కోసం ఇంకేమి చెయ్యగలను.
స్వతహాగా రాజు గారు ఘట్టమనేని కృష్ణగారికి వీరాభిమాని అయితే కృష్ణ గారికి అభిమానుల్లో నచ్చే మొదటి వ్యక్తి బిఏ రాజు అంటే ఆయన కృష్ణ గారికి ఎంత ప్రత్యేకతో సెపరేట్ గా చెప్పనక్కర్లేదు. ఆ అభిమానానికి నిదర్శనమే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన చేతుల్లో ఆడుకుంటూ పెరగడం. అందుకే మహేష్ బాబుకి ఆయన మరింత ఆప్తుడయ్యాడు. ఒక్క మహేష్ బాబు ఫ్యామిలీకే కాదు అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలతో పాటు, బడా బడా నిర్మాతలకి తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఆయనే కావాలి. రాజుగారు పీఆర్వోగా చేస్తున్నారు అంటే ప్రమోషన్స్ విషయంలో మనకు ఎలాంటి బెంగాలేదని కొంతమంది నిర్మాతలు గుండెమీద చేయి వేసుకొని హాయిగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బిఏ రాజు అంటే ఒక స్టార్ పీఆర్వో అన్న భావన ఆయనలో ఉండదు. అందుకే ఆయన ప్రెస్ మీట్, సక్సెస్ మీట్, ప్రెస్ షో లేదా మరే ఇతర ఈవెంట్ అయినా మాలో ఒక్కడుగా, మాతో పాటే ఆయన అంటూ మీడియా మిత్రులతో కలిసి నవ్వుతూ, నవ్విస్తూ, భుజం మీద చేయి వేసి జోక్స్ చెబుతూ సరదాగా ఉంటారు. అందుకే మీడియా మిత్రులంతా రాజు గారంటే ఆయనను పీఆర్వో అనడంకంటే ఆయన మా ఆప్తుడని, మా ఇంటికి పెద్దన్న అని గర్వంగా చెప్పుకుంటారు.
బిఏ రాజు ఒక్క పిఆర్వోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆయన నిర్మించిన ‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘గుండమ్మ గారి మనవడు’, ‘లవ్ లీ’ సినిమాలను నిర్మించాడు. ఈ ఫిబ్రవరి నుంచి మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టనున్నాడు. ఏ రంగంలోనైనా ‘నీలో సత్తా ఉంటే విజయం నీకు తలవంచాల్సిందే’ అన్న మాట ఈయనకు చక్కగా సరిపోతుంది. ఇప్పటి వరకూ అత్యధిక సినిమాలకు పీఆర్వోగా పనిచేసిన రికార్డు కూడా ఆయనకే సొంతం..
సీనియర్ హీరోలకు ఆయనంటే మక్కువ మరియు మర్యాద… నేటితరానికి ఆయనంటే అభిమానం.. మీడియా మిత్రులకి ఆప్తుడు… సినిమా ప్రమోషన్స్ లో రారాజు ఆయనే మన బిఏ రాజు.. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయనకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ముందు ముందు పీఆర్వోగా, నిర్మాతగా మరెన్నో విజయాలను అందుకొని తెలుగు చిత్ర సీమలో ఓ కలికితురయిలా నిలిచిపోవాలని కోరుకుంటున్నాం..


