విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే బల్‌వంత్’. గతంలో ‘హే భగవాన్’గా ఉన్న ఈ టైటిల్‌ను తాజాగా మార్చారు. గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఫిబ్రవరి 20న థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నాట్ ఏ టైటిల్ ఈవెంట్’కు హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘హే బల్‌వంత్’ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కెరీర్ ప్రారంభంలో సెట్స్‌లో ఎదురైన అవమానాలను చిరునవ్వుతో దాటుకుని, నేడు కీర్తి సురేష్ వంటి స్టార్‌తో నటించే స్థాయికి ఎదిగానని గుర్తుచేసుకున్నారు. కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా పనిచేసే సుహాస్ ఖాతాలో ఈ సినిమాతో మరో హిట్ ఖాయమని సందీప్ కిషన్ ప్రశంసించారు.
డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. టైటిల్, రిలీజ్ డేట్ మారినా కంటెంట్ ఇచ్చే ఇంపాక్ట్ మారదన్నారు. తండ్రీకొడుకుల భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ పైసా వసూల్ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా విజయంపై ఉన్న నమ్మకంతో వేదికపైనే దర్శకుడు గోపీకి తన తదుపరి చిత్రం కోసం ఆయన అడ్వాన్స్ ఇవ్వడం విశేషం. హీరోయిన్ శివానీ నాగారం, దర్శకుడు, నిర్మాతలు ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


