తేజ ‘హోరా హోరీ’కి హెల్ప్ కానున్న సోలో రిలీజ్

hora-hori
కెరీర్ ప్రారంభంలో ‘చిత్రం’, జయం, నువ్వు నేను, నిజం లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ తేజ ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. 2012లో వచ్చిన ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ తేజ మళ్ళీ తన బ్రాండ్ మార్క్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే ‘హోరా హోరీ’. తన కమ్ బ్యాక్ ఫిల్మ్ లా చేసిన ఈ సినిమా కోసం కూడా తన మార్క్ ప్రేమకథనే ఎంచుకోవడం గమనార్హం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉండడం, అలాగే కళ్యాణి మాలిక్ అందించిన పాటలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న అనగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాతో పాటు నితిన్ కొరియర్ బాయ్ రిలీజ్ కావాల్సి ఉంది, కానీ అది వాయిదా పడడంతో ఈ వారం ‘హోరా హోరీ’ సోలోగా ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ ఉండడం వలన కచ్చితంగా తేజ ఈ సారి మెప్పిస్తాడని సినీ అభిమానులు భావిస్తున్నారు. తేజ మరోసారి నూతన నటీనటులైన దిలీప్ – దక్షలను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమాని శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో సురేష్ బాబు కూడా జాయిన్ అవ్వడం సినిమాకి మరింత హైప్ తెచ్చింది.

తేజ కచ్చితంగా హిట్ కొడతానని నమ్మకంగా ఉన్న హోరా హోరీ సినిమాకి సోలో రిలీజ్ కూడా హెల్ప్ అవ్వడంతో ప్రేక్షకులు కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి వారి అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Exit mobile version