‘జులాయి’ చిత్రంతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న తాజా సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. జనవరి 20వ తేదీ నుండి తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సూటయ్యే టైటిల్ అన్వేషణలో దర్శకుడు ఉన్నారు. మొదట ‘త్రిశూలం’ అనే టైటిల్ పరిశీలనలోకి వచ్చింది. తాజాగా ‘హుషారు’ అయితే పర్ఫెక్ట్ టైటిల్ అని చిత్ర బృందం భావిస్తుందట. అధికారికంగా టైటిల్ గురించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.
అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సమంత, నిత్య మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.


