కాకతీయ సామ్రాజ్యపు వీరనారి రాణీ రుద్రమదేవి జీవిత కథతో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’. భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమాగా రూపొందిన రుద్రమదేవి, గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలైన నాటినుంచే ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలోనే రుద్రమదేవి సినిమాకు ఆదరిస్తున్న ప్రేక్షకుల ధన్యవాదాలు తెలుపుతూ, సినిమా యూనిట్ నిన్న సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌కు అల్లు అర్జున్, అనుష్క, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, కృష్ణం రాజు, దిల్‌రాజు తదితరులు విచ్చేసి సినిమాకు మంచి విజయం చేకూర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి అనే పాత్రలో కనిపించి మెప్పించిన అల్లు అర్జున్, గోన గన్నారెడ్డి పాత్ర చేసినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ..”ఈ సినిమా విషయంలో అందరికంటే ముందుగా దర్శకుడు గుణశేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి ఒక హిస్టారికల్ పాత్రను నాకు ఇచ్చినందుకు, ఒక స్త్రీ పాత్ర ప్రధానంగా నడిచే సినిమాను స్వయంగా నిర్మించి దానికోసమే ఆయన పడిన కష్టానికి హ్యాట్సఫ్ చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో నటించిన అందరికీ పేరొచ్చినా సినిమా హీరో ఎవరంటే అనుష్కే! రుద్రమదేవి కోసం నాది 30 రోజుల కష్టమైతే, అనుష్కది మూడు సంవత్సరాల కష్టం. తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి సారిగా గోన గన్నారెడ్డి అనే పాత్ర నేను చేసినందుకు గర్వంగా ఉంది” అని తెలిపారు.
