అమితాబ్ ఒప్పుకోకపోతే ఆ సినిమా చేయను : బాలకృష్ణ

balakrishna
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ సినిమా విజయంపై బాలకృష్ణ ధీమాగా ఉన్నారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇకపై చేయబోయే సినిమాలు కూడా తన స్థాయిని పెంచేవిగానే ఉంటాయని స్పష్టం చేస్తూ 101వ సినిమా గురించి బాలకృష్ణ మాట్లాడారు.

దర్శకుడు కృష్ణవంశీతో 101వ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని, అందులో ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ను సంప్రదించామని తెలుపుతూ, ఒకవేళ అమితాబ్ ఒప్పుకోకపోతే ఆ సినిమా ఉండదని బాలకృష్ణ స్పష్టం చేశారు. అయితే అమితాబ్ ఒప్పుకుంటారన్న నమ్మకం తనకు ఉందని బాలయ్య అన్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విషయానికి వస్తే, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.