
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన బాణీతో దేశంలోని అద్భుతమైన సంగీత దర్శకుల్లో మొదటి వరుసలో స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాటలను అమితంగా ఇష్టపడే అభిమానుల సంఖ్యకు లెక్కే లేదు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తన పాటలను అనధికారికంగా ఎఫ్. ఎం. స్టేషన్లలో, ఆన్‌లైన్లో వాడుకుంటున్నారని గత కొంతకాలంగా ఆయన ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై తాజాగా ఆయన తమిళనాడు పోలీసులను ఆశ్రయించారు.
తమిళనాడు డీజీపీ, చెన్నై పోలీస్ కమీషనర్, ఇతర జిల్లాల ఎస్పీలకు ఆయన ఈ విషయమై ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా తాను స్వరపరిచిన పాటలు ఆన్‌లైన్లో, ఎఫ్.ఎం.స్టేషన్లలో వాడుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. అదేవిధంగా తన అనుమతి లేనిదే తన పాటలతో పాటు పేరు, ఫోటోగ్రాఫ్‌లను వాడుకోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఇక ఈ మధ్యే తన పాటలను ప్లే చేసిన ఎఫ్.ఎం. స్టేషన్‌కు ఆయన ఓ లేఖ కూడా రాశారు.