శింబు హీరోగా తమిళంలో రూపొందిన ‘వాలు’ అనే సినిమా, మూడేళ్ళుగా విడుదలకు నోచుకోకుండా ఈ తమిళ స్టార్ హీరోను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. ఈ మూడేళ్ళలో వేరే ఏ ఇతర సినిమా చేయక, ‘వాలు’ విడుదల కాక శింబు కెరీర్ అస్థవ్యస్థంగా తయారైంది. విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాలు’ సినిమా కొన్ని ఆర్థిక సమస్యల వల్ల విడుదలకు నోచుకోకుండా కోర్టు వద్ద ఆగిపోయింది. చాన్నాళ్ళ పాటు కోర్టు ముందు ఎన్నో చర్చలు జరిగినా విడుదల దాకా వచ్చి సినిమా చాలాసార్లు ఆగిపోయింది. ఈ నేఫథ్యంలో అసలు ‘వాలు’ విడుదలవుతుందా? లేదా? అన్న ప్రశ్న కూడా తలెత్తింది.
అయితే చివరకు తమిళ పరిశ్రమ సపోర్ట్, శింబు కృషితో సినిమా విడుదలకు గత వారం మోక్షం కలిగింది. ఆగష్టు 14న తమిళ నాట పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. శింబు స్టైల్ కమర్షియల్ సినిమాకు హిట్ టాక్ కూడా రావడంతో అభిమానులు కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఇన్నేళ్ళుగా తనను ఎంతో ఇబ్బందికి గురిచేసిన ‘వాలు’ చివరకు థియేటర్లకు రావడంతో పాటు హిట్ దిశగా దూసుకుపోతుండడంతో శింబు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం శింబు వరుస సినిమాలను లైన్లో పెట్టి మళ్ళీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులేస్తున్నారు.
