విడుదల తేదీ : అక్టోబర్ 02, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : యష్నా ముత్తులూరి, వారాహి మల్లిపాముల, సాయి కృష్ణ, కిరీటి దామరాజు, వైష్ణవి వర్మ తదితరులు
దర్శకత్వం : నిశాంతి ఏవని
నిర్మాతలు : వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల
సంగీతం : నిర్వాణ్ ఆత్రేయ, రాజా కుమారి, కరణ్ పాండవ్
ఛాయాగ్రహణం : జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు : హరి శంకర్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిన్న చిత్రాల్లో బోల్డ్ అండ్ సోషల్ సెటైరికల్ డ్రామా ‘ఇంప్యూర్’ కూడా ఒకటి. యంగ్ టీమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
సంధ్య (యష్నా ముత్తులూరి) అనే ఒక స్వతంత్ర ఆలోచనలు ఉన్న యువతికి పెళ్లి నిశ్చయమవుతుంది. నిశ్చితార్థం పనులు జరుగుతుండగా, ఆమె గతం గురించి ఒక నిజం బయటకు రావడం వల్ల అత్తమామలు ఈ పెళ్లిని రద్దు చేసుకుంటారు. ఈ పరిణామంతో సంధ్య తీవ్ర మనోవేదనకు గురవుతుంది. సమాజం విధించే ఇలాంటి కట్టుబాట్లను, డబుల్ స్టాండర్డ్స్‌ను ప్రశ్నించడానికి ఆమె స్నేహితులు వీర (వారాహి మల్లిపాముల), ప్రణవ్ (సాయి కృష్ణ)లు ఆమెకు తోడుగా నిలుస్తారు. మరి ఈ ముగ్గురూ కలిసి సమాజపు పాతకాలపు ఆలోచనలపై ఎలా పోరాడారు? ఈ ప్రయాణంలో వారు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? చివరికి సంధ్య జీవితం ఏ తీరానికి చేరింది? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్లు:
సినిమాకి ప్రధాన బలం దర్శకురాలు ఎంచుకున్న బోల్డ్ కాన్సెప్ట్. నేటి తరం ఆలోచనలకు అద్దం పడుతూ, పాతకాలపు పద్ధతుల పేరుతో మహిళలపై చూపే వివక్షను ప్రశ్నించిన తీరు ఆకట్టుకుంటుంది.
హీరోయిన్‌గా చేసిన యష్నా ముత్తులూరి తన పాత్రలో జీవించింది. ఎమోషనల్ అండ్ హార్డ్ హిట్టింగ్ సీన్స్‌లో ఆమె నటన చాలా సహజంగా ఉంది. వారాహి మల్లిపాముల మరియు సాయి కృష్ణలు తమ పాత్రల్లో ఒదిగిపోయి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆర్జే కాజల్ మరియు కిరీటి దామరాజు పాత్రలు అక్కడక్కడా మంచి వినోదాన్ని అందిస్తాయి.
మైనస్ పాయింట్లు:
ఎంచుకున్న పాయింట్ ఎంత బాగున్నా, కథనం విషయంలో దర్శకురాలు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న వేగం సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి తగ్గిపోతుంది.
సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. పాత్రల మధ్య వచ్చే చర్చలు కొన్నిచోట్ల సినిమాటిక్‌గా కాకుండా క్లాస్ పీకుతున్నట్లుగా నాటకీయంగా మారిపోతాయి. క్లైమాక్స్ డ్రామాను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది.
సాంకేతిక వర్గం:
జ్ఞానశేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా కనిపిస్తాయి. నిర్వాణ్ ఆత్రేయ మరియు రాజా కుమారి అందించిన సంగీతం సన్నివేశాల మూడ్‌కు తగ్గట్టుగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. దర్శకురాలు నిశాంతి ఏవని ఆలోచన బాగుంది కానీ, స్క్రీన్‌ప్లేపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే అవుట్‌పుట్ మరింత గ్రిప్పింగ్‌గా వచ్చేది.
తీర్పు:
మొత్తంగా చూస్తే, ‘ఇంప్యూర్’ అనే టైటిల్‌తో వచ్చిన యూత్‌ఫుల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. కథలోని కోర్ పాయింట్, జెన్‌జీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్, సినిమాటోగ్రఫీ వర్క్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్. కానీ కథను తీసుకెళ్లిన విధానం, స్లో గా సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్‌గా సాగే నెరేషన్ ఈ చిత్రానికి మైనస్. యూత్‌ఫుల్ డ్రామాలను ఇష్టపడేవారిని ఈ చిత్రం ఇంప్రెస్ చేయకపోవచ్చు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team


